ఆప్కో చైర్మన్ పదవికి హనుమంత రావు రాజీనామా

1 Aug, 2016 19:56 IST|Sakshi

- కొత్త చైర్మన్‌గా గుజ్జల శ్రీను పేరు సీఎంకు సిఫారసు
- ఇరువర్గాలతో చర్చించి కొలిక్కి తెచ్చిన మంత్రులు

సాక్షి, విజయవాడ బ్యూరో

ఆప్కో చైర్మన్ పదవికి ఎం.హనుమంతరావు సోమవారం రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలతో విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆప్కో చైర్మన్ పదవిని చేపట్టిన హనుమంతరావు అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరారు. అప్పట్లో మూడున్నర సంవత్సరాలు ఆయన ఆప్కో చైర్మన్ పదవిలో కొనసాగేలా అవకాశం ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించి మరో ఏడాదిన్నర కాలాన్ని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన గుజ్జ్జల శ్రీనుకు కట్టబెట్టేలా నిర్ణయించారు.

 

ఆప్కో చైర్మన్ పదవి విషయంలో హనుమంతరావు, శ్రీను వర్గాలు పంతాలకు పోయి పట్టుబట్టడంతో ముగ్గురు మంత్రులు నచ్చజెప్పి వారి పంచాయితీని సర్దుబాటు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఎం.హనుమంతరావు తాను ఆప్కో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రులు గంటా, ప్రతిపాటి, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముందుగా అనుకున్న షరతు ప్రకారం హనుమంతరావు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం అభినందనీయమన్నారు. ఆప్కో చైర్మన్ పదవికి గుజ్జల శ్రీను పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి సిఫారసు చేసి ఖరారు చేస్తామన్నారు.

 

అందుకు 13 జిల్లాల ఆప్కో డెరైక్టర్లు ఆమోదం తెలిపారని మంత్రులు చెప్పారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9 ప్రకారం ఉమ్మడి ఆప్కో ఆస్తుల పంపకాల వివరాలను స్పష్టం చేయడం జరిగిందని వివరించారు. తెలంగాణ నుంచి రూ.40కోట్లు మన ఆప్కోకు రావాల్సి ఉంటుందన్నారు. నిధులు ఉన్నప్పటికీ పంపకాలు జరగడంలేదని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారా చర్యలు కోరతామని మంత్రులు వివరించారు. ఏపీ ప్రభుత్వం, అనుబంధ శాఖలు కూడా ఆప్కోకు రావాల్సిన నిధులను సమీకరించేందుకు చర్యలు చేపడతామని, చేనేత రంగంలో ఉత్పత్తులను సేకరించడానికి కూడా ప్రభుత్వం చొరవచూపుతోందని వివరించారు.

 

మరిన్ని వార్తలు