అమృతోపమానం.. హరికథాగానం

8 Jan, 2017 22:40 IST|Sakshi
  • ఆద్యుడు ఆదిభట్ల నారాయణదాసు  l
  • ఆదరణ కోల్పోతున్న కళకు ‘అభ్యుదయ’ ఊతం
  • కాకినాడ కల్చరల్‌ :
    యక్షగానం నుంచి ఆవిర్భవించిందని భావించే హరికథకు ఆద్యుడు ఆదిభట్ల నారాయణదాసు కాగా అనంతరం ఎందరో ఈ కళారూపాన్ని అమృతోపమాన గానప్రక్రియగా అభివృద్ధి చేశారు. తొలినాళ్ళలో విష్ణువు (హరి) గురించి ఎక్కువ గానం చేసేవారు గనుక ఆ పేరు వచ్చిందని కొందరు చెబుతారు. కాలక్రమేణా విష్ణు కథలనే కాక ఇతర దేవుళ్ళ కథలు కూడా గానం చేసినా ‘హరికథ’గానే స్థిరపడింది. భక్తికథలే కాక సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా హాస్యం మేళవించి హరికథ చెప్పే కథకుడు పట్టుపంచె, కాళ్ళకు గజ్జెలు, నుదుట నామం, మెడలో పూలమాల, చేతిలో చిడతలతో విలక్షణంగా కనిపిస్తాడు. చిడతలను లయబద్ధంగా మోగిస్తూ, గానం చేస్తుంటే మృదంగం, వయోలిన్, హార్మోనియం విద్వాంసులు  సహకారం అందజేస్తారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రజల్లో దేశభక్తిని రగిలించడంలో హరికథలు కీలక పాత్ర పోషించాయి. ఒకనాడు విశేషంగా ఆదరణ పొందిన హరికథలకు సినిమా, టీవీల ప్రభావంతో క్షీణదశ మొదలైంది. ఈ తరుణంలో అభ్యుదయ ఫౌండేష¯ŒS ఈ కళకు పునరుత్తేజాన్ని కల్పించాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే కాకినాడ సూర్యకళా మందిర్‌లో హరికథా సప్తాహ మహోత్సవాలు నిర్వహించారు. శనివారం రాత్రితో ఈ వేడుక ముగిసింది. ఉత్సవాల్లో గానం చేసిన ప్రముఖ హరికథకుల అభిప్రాయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.
     
    3 వేలకు పైగా హరికథలు చెప్పా..
    మృదంగ విద్వాంసుడైన మా నాన్న పి.సాంబశివరావు స్ఫూర్తితో. పన్నెండో ఏట కపిలేశ్వరపురం హరికథా శిక్షణాలయంలో రాజశేఖరుని లక్ష్మీపతి భాగవతులు, పులుగు వీరయ్య భాగవతులు వద్ద హరికథ గానంలో శిక్షణ పొందాను. 25 ఏళ్లుగా మూడు వేలకు పైగా హరికథా గానాలు చేశాను. ఈ కళకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. కేవలం టీటీడీ మాత్రమే హరికథా విద్వాంసులకు చేయూతనిస్తోంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే  హరికథకు పూర్వ వైభవం వస్తుంది.
    – మెగిలిచర్ల నాగమణి భాగవతారిణి (తెనాలి)
     
    సంప్రదాయ కళలపై చిన్నచూపు
    మా నాన్న వీర రాఘవయ్య నటుడు, హార్మోనియం విద్వాంసుడు. హరికథా గానం నేర్చుకోవడానికి ఆయనే నాకు స్ఫూర్తి. ఆర్‌.లక్షీ్మపతిరావు వద్ద హరికథా శిక్షణ, ఐ.వెంకటేశ్వరరావు వద్ద సంగీత శిక్షణ పొందాను. గత నలభయ్యేళ్లుగా 4,400 హరికథా గానాలు చేశాను. ప్రజలు టీవీ, సినిమా వ్యామోహంలో ఉన్నారు. సంప్రదాయ కళలకు  ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉంది. కళాకారులకు గుర్తింపు లేదు. పింఛన్ల కోసం అధికార్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏ కళయినా ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైనే ఆధారపడి ఉంటుంది. పాఠశాలు, కళాశాలలలో హరికథ శిక్షణను ప్రవేశ పెట్టి, కోర్సు పూర్తి చేసినవారికి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
    – మడమల రాంబాబు భాగవతార్‌ (మచిలీపట్నం) 
    ప్రభుత్వం ఆదుకోకుంటే అంతరించే ప్రమాదం
    హరికథలు నేర్చుకోవడానికి మా అన్నయ్య, సినీ రచయిత జేకే భారవే నాకు స్ఫూర్తి. కనుమలూరి జగన్నాథ భాగవతార్‌ (తిరుపతి) వద్ద శిక్షణ పొందాను. 40 ఏళ్లుగా నాలుగు వేలకు పైగా హరికథా గానాలు చేశాను. సంప్రదాయ కళలకు  జనం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. హరికథకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయకపోతే ఈ కళ అంతరించే ప్రమాదం ఉంది. సాంస్కృతిక శాఖ కొందరు కళాకారులకు నెలకు కేవలం రూ.1000 పింఛను ఇస్తోంది. చాలామంది కళాకారులకు పింఛన్లు అందడం లేదు.  దేవాదాయ శాఖకు చెందిన అన్ని దేవాలయాలు, గ్రామాల్లో ఉన్న రామాలయాలు, కమ్యూనిటీ హాళ్లలో వారానికి ఒక రోజు హరికథా గానం ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపాధి కలుగుతుంది. యువత కూడా ఈ కళవైపు వస్తారు. హరికథలు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, సమాజంలో నైతికతలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజలను ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి.
    – వేదవ్యాస శ్రీరాంభట్టార్‌ భాగవతార్‌ (వరంగల్‌)
     
>
మరిన్ని వార్తలు