లక్ష్యం పూర్తయ్యే వరకు హరితహారం

23 Jul, 2016 21:19 IST|Sakshi
లక్ష్యం పూర్తయ్యే వరకు హరితహారం
  • కల్తీ కల్లును అరికట్టేందుకే..
    • ఈత వనాల పెంపకానికి ప్రోత్సాహం
    • మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
    వర్ని/బీర్కూర్‌ : నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ కల్తీ కల్లుకు పేరొందాయని, కల్తీ కల్లును అరికట్టి స్వచ్ఛమైన కల్లును అందుబాటులోకి తీసుకొచ్చేందుకే హరితహారంలో ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లక్ష్యం పూర్తయ్యే వరకూ హరితహారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం వర్ని మండలంలోని అక్బర్‌నగర్‌లో, అలాగే, బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లో మొక్కలు మంత్రి మొక్కలు నాటారు. తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడారు. కల్తీ కల్లును నివారించేందుకు ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని పోచారం చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 3.75 లక్షల ఈత మొక్కలు నాటించామని, మరో 1.25 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ మొక్కలు పెరిగిన తర్వాత కల్లు ప్రియులకు స్వచ్ఛమైన కల్లు దొరుకుంతుదని తెలిపారు. తద్వారా గీతకార్మికుల జీవనోపాధి మెరుగవుతుందని, ఎక్సైజ్‌ అధికారుల దాడులు ఉండవని చెప్పారు. ఇటీవల కోటగిరిలో 700 గిలక తాళ్లు అనే కొత్త రకం ఈతమొక్కలు నాటించామని, ఒక్కో చెట్టు 30–50 లీటర్ల కల్లునిస్తుందని వివరించారు. 

     

మరిన్ని వార్తలు