హరితమయం

16 Jul, 2016 22:43 IST|Sakshi
హరితమయం

 కలెక్టర్ నుంచి వీఆర్‌ఓ దాకా....
 ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు..
 అందరూ హరితహారంలో బిజీ
 బోసిపోతున్న సర్కారు కార్యాలయాలు
 23 వరకు మొక్కలు నాటాల్సిందేనని ఆదేశాలు
 జిల్లాలో 4కోట్ల మొక్కలు నాటడమే ల క్ష్యం

 
 జిల్లాలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. కలెక్టర్ నుంచి వీఆర్‌ఓ వరకు... ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. కలెక్టరేట్ మొదలు మండల అధికారులంతా హరితహారంలో పాలు పంచుకుంటున్నారు. ఈనెల 8న హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క అధికారి కూడా కనిపించడం లేదు. హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దాదాపు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తమ పరిధిలో మొక్కలు నాటుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే దాదాపు అన్ని రెవెన్యూ డివిజన్లలో పర్యటించి స్వయంగా మొక్కలు నాటారు. మంథని డివిజన్‌లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి మొక్కలు నాటి హరితహారం ప్రాముఖ్యతను తెలియజేశారు. మరో మంత్రి కేటీఆర్ సైతం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించి హరితహారంలో పాల్గొన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్త­ృతంగా పర్యటిస్తూ హరితహారంలో స్వయంగా మొక్కలు నాటుతున్నారు. ఎస్పీ జోయల్‌డేవిస్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ జారుుంట్ కలెక్టర్ నాగేంద్రసహా దాదాపు అన్ని విభాగాల అధిపతులు హరితహారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.
 
 23 వరకు ఇదే పని..
 ఈనెల 23 వరకు ఇతర కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా హరితహారంపైనే దృష్టిసారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు. సీఎస్ ఆదేశాలతో సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన, జిల్లాల పునర్విభజన కసరత్తుసహా ఇతరత్రా పనులన్నింటినీ అధికారులు పక్కనపెట్టేశారు. ఇతరత్రా పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చే సాధారణ ప్రజానీకం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులెవరూ లేకపోవడంతో ఉసూరుమని వెళ్లిపోతున్నారు. ఈనెల 23 వరకు పరిస్థితి ఇంతేనని, ఆ తరువాతే రావాలని అక్కడున్న సిబ్బంది సూచిస్తున్నారు.
 
 కోటి మొక్కలకు చేరువలో...
 జిల్లాలో రెండో విడత హరితహారం ప్రారంభమై శుక్రవారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యూరుు. ఇప్పటివరకు దాదాపు కోటి మొక్కలు నాటారు. ఈనెల 8 నుంచి 23 వరకు 15 రోజుల్లో 4కోట్ల మొక్కలను నాటాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. మరో వారం రోజులే గడువు ఉండటంతో మూడు కోట్ల మొక్కలు నాటగలరా.. లేదా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఈనెల 18న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒకేరోజు 50 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగా రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 19న అసైన్డ్, దళితుల భూముల్లో లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎన్టీపీసీ, సింగరేణి కాలరీస్‌సహా ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు సైతం తమ వంతుగా హరిత హారం కార్యక్రమంలో మొక్కలు పంపిణీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు