సుస్వరాల ‘శాలిని’

3 Aug, 2016 00:13 IST|Sakshi
అమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న శాలిని
 • పాటల రంగంలో రాణిస్తున్న గిరిజన బిడ్డ
 • తెలంగాణ ఉద్యమంలో హోరెత్తించే గీతాలు
 • ‘ఆటా’ ఉత్సవాలకు తెలంగాణ సాంస్క­ృతిక సారథి తర పున హాజరు
 • నెల రోజులపాటు 14 రాష్ట్రాల్లో ప్రదర్శనలు
 • స్వగ్రామానికి తిరిగివచ్చిన గాయకురాలు
 • ‘‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’’ అనే నానుడిని నిజం చేస్తూ ముందుకుసాగుతోంది ఓ జానపద గాయకురాలు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆత్మ విశ్వాసంతో దూసుకుపోతోంది. ఈ మేరకు తెలంగాణ జానపద గీతాలతోపాటు సందేశ్మాతక, మెలోడీ పాటలు పాడుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మారుమూల తండా నుంచి అమెరికాకు వెళ్లి తన మధురమైన గానంతో తెలుగు ప్రజలను ఓలలాడించిన సుస్వరాల మాలిని.. ‘శాలిని’పై ప్రత్యేక కథనం. –నర్సంపేట
   
  కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపిస్తూ ముందుకుసాగుతోంది జానపద గాయకురాలు శాలిని. నర్సంపేట డివిజన్‌ పరిధిలోని ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు నాజీతండాకు చెందిన గుగులోతు లక్ష్మి, సోమ్లానాయక్‌ దంపతులకు ఆరుగురు సంతానం ఉన్నారు. సోమ్లానాయక్‌ వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను కష్టపడి చదివించారు.
   
  రెండో తరగతిలోనే పాటలు
  సోమ్లానాయక్‌ సంతానంలో ఐదో అమ్మాయిగా జన్మించిన శాలినికి చిన్నప్పటి నుంచే పాటల రంగంపై మక్కువ ఎక్కువ. ఇంట్లో అమ్మ, అన్నయ్య అప్పుడప్పుడు పాడే పాటలను ఆసక్తిగా గమనించిన శాలిని అందులో ప్రావీణ్యం సంపాదించాలని ఆరాటపడేది. ఈ క్రమంలో తం డాలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న సమయంలో ఆమె పాడిన దేశభక్తి గీతానికి ఉపాధ్యాయుడు మదార్‌హుస్సేన్‌ మంత్రముగ్దుడయ్యారు. ఈ మేరకు పాటల రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆయన శాలినిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలా మెుదలైన శాలిని పాటలు.. ప్రవాహంలో కొనసాగుతున్నాయి. కాగా, శాలిని 5వ తరగతి వరకు మంగళవారిపేటలో, 6 నుంచి పదో తరగతి వరకు బుధరావుపేట ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఇంటర్, డిగ్రీ నర ్సంపేటలో పూర్తి చేసింది. అలాగే హన్మకొండలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సును కూడా అభ్యసించింది.
   
  తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు
  ఓ వైపు క్రమశిక్షణతో చదువుకుంటూనే.. మరో వైపు తనకు ఇష్టమైన పాటల రంగంలో రాణిస్తూ శాలిని పేరు సంపాదించింది. ప్రధానంగా 2008 నుంచి తెలంగాణ ధూంధాంలలో పాల్గొని తన వంతుగా ఎన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచింది. గాయకులు తాళ్లపెల్లి సునీల్, వరంగల్‌ శ్రీనివాస్‌ బృందాలతో కలిసి నర్సంపేట డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి సాంస్క­ృతిక కార్యక్రమాలకు హాజరై పాటలు పాడింది. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ టీవీ చానల్‌ నిర్వహించిన ‘రేలారే రేలా’ పోటీల్లో పాల్గొని టైటిల్‌ విజేతగా నిలిచి ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటింది.
   
  నిర్భయపై పాట
  ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటనను దృష్టిలో పెట్టుకుని శాలిని ‘సన్నపు రైక’ అనే సందేశాత్మక పాటను రాసి పాడి వినిపించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. జానపద గీతాలతోపాటు మెలోడీ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో పాటలు రాస్తూ.. పాడుతూ శాలిని ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
   
  ఆటా ఉత్సవాలకు ఎంపిక
  అమెరికాలో జూలైలో నిర్వహించిన ఆటా ఉత్సవాలకు శాలిని తెలంగాణ సాంస్క­ృతిక సారథి బృందం తరపున ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మెుత్తం ఎంపికైన 15 మంది మహిళా కళాకారుల్లో వరంగల్‌ జిల్లా నుంచి శాలిని ఒక్కరే ఉండడం గమనార్హం. ఈ మేరకు తెలంగాణ సాంస్క­ృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో శాలిని జూన్‌ 27న అమెరికాకు వెళ్లి 14 రాష్ట్రాల్లో తెలంగాణ జానపద గీతాలు ఆలపించి అక్కడి తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. నెలరోజుల పాటు విదేశాల్లో పర్యటించిన శాలిని మంగళవారం ఇంటికి చేరుకుంది.
   
  గొప్ప అనుభూతి
  మారుమూల తండాలో పుట్టిన నేను అమెరికాకు వెళ్లి పాటలు పాడడం సంతోషంగా ఉంది. తెలంగాణ సంస్కృతిని అమెరికా దేశస్తులతో పాటు అక్కడ ఉంటున్న తెలుగు ప్రజలకు తెలియజేసే అవకాశం లభించడం నా అదృష్టం. నెలరోజుల్లో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో ప్రదర్శనలు చేపట్టి అక్కడి ప్రజల మన్ననలు పొందాను. నిజంగా ఇది గొప్ప అనుభూతి. 
  –శాలిని, కళాకారిని, నర్సంపేట 
   
  శాలిని పాటలు అద్భుతం
  తెలంగాణ సాంస్క­ృతిక సారథి బృందం సభ్యులు నెలరోజుల పాటు అమెరికాలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ వారు పాడిన పాటలు, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. శాలిని తన మధురమైన గానంతో మమ్మల్ని అలరించింది. తెలంగాణ నుంచి వచ్చిన కళాకారులకు సహకారం అందించడం గర్వంగా ఉంది. 
  –అనుగు లక్ష్మారెడ్డి, అమెరికా తెలుగు అసోసియేషన్‌ మెంబర్‌
మరిన్ని వార్తలు