హెచ్‌సీయూలో కొనసాగుతున్న వేధింపులు

19 Nov, 2016 23:16 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వివక్షకు నిలయంగా మారుతోంది. అధికారుల వైఖరి కారణంగా ఉన్నత విద్యావంతులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. మొన్న మాదారి వెంకటేశం, నిన్న వాసు, నేడు మోజెస్‌ అబ్రహం. పేర్లు వేరైనా  దళితులపై వివక్ష కారణంగానే వారు అన్యాయానికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరి కొందరు పారిపోతున్నారు, మరికొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారుల వైఖరిలో మార్పురావడం లేదు. శుక్రవారం రాత్రి మోజెస్‌ అబ్రహం అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నంతో వర్సిటీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

రోహిత్‌ వేముల ఆత్మహత్యతో వివక్షపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగినా హెచ్‌సీయూలో ఎలాంటి మార్పు రాకపోగా దళిత విద్యార్థులపై  వివక్ష కొనసాగుతూనే ఉది. కొందరు విద్యార్థులు దీనిని తట్టుకోలేక, బానిసలుగా బతకలేక చావుకు సిద్ధపడుతుండగా మరి కొందరు కష్టపడి సంపాదించుకున్న సీట్లను వదిలేసి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. మరికొందరు కూలిచేసి చదివిస్తున్న తల్లిదండ్రులకు ముఖం చూపలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2013 నవంబర్‌ 24న మాదారి వెంకటేశం అనే దళిత పీహెచ్‌డి స్కాలర్‌ ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇబ్రహీం పట్నానికి చెందిన వెంకటేశం 2011లో అడ్వాన్స్ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్ హై ఎనర్జీ లో పీహెచ్‌డీ కోర్సులో చేరాడు. వర్సిటీ నిబంధనల మేరకు అతనికి పీహెచ్‌డీలో చేరిన రోజే గైడ్‌ను కేటాయించాల్సి ఉంది. అయితే అతడికి మూడేళ్ల పాటు గైడ్‌ను ఇవ్వకపోవడంతో మనస్థాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మోజెస్‌ అబ్రహం కూడా అదే డిపార్ట్‌మెంట్, అదే అంశం (ఫిజిక్స్‌ )పై పరిశోధన చేస్తుండటం గమనార్హం.

మాదారికి ఎదురైన వేధింపులే అబ్రహంకు ఎదురయ్యాయి.  దళిత క్రిస్టియనైన మోజెస్‌ అబ్రహం 17న హెచ్‌సియులో జరిగిన ఓ సెమినార్‌లో పేపర్‌ ప్రజెంట్‌ చేశాడు. అప్పటికే ప్రతి చిన్న విషయానికీ వేధిస్తున్న సూపర్‌వైజర్‌ ప్రొఫెసర్‌ జి.ఎస్‌. వైతీశ్వరన్ అబ్రహంకి గైడ్‌ గా ఉండనని, తక్షణమే గైడ్‌ను మార్చుకోవాలని చెప్పడంతో అతడి ఎదురుగానే బ్లేడ్‌తో ముంజేతి నరం కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడికి యూనివర్సిటీలో డాక్టర్‌ అనుపమ కుట్లువేసి  బంజారా హిల్స్‌లోని ఆశా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని తన కారులోనే ఆసుపత్రికి తీసుకెళ్తూ కూడా సూపర్‌వైజర్‌ జిఎస్‌.వైతీశ్వరన్ దుర్భాషలాడినట్లు తెలిసింది.

 దీనికితోడు గైడ్‌గా కొనసాగేందుకు ప్రొఫెసర్‌ తిరస్కరించడం, ‘మీకెందుకు చదువ’ంటూ ఎద్దేవా చేయడం ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాయని ఎఎస్‌ఎ నాయకుడు దొంత ప్రశాంత్‌ ఆరోపించారు.  ప్రస్తుతం ప్రొ వీసీగా ఉన్న బిపిన్ శ్రీవాస్తవ్‌ అవమానించినందునే తమిళనాడుకి చెందిన సెంథిల్‌ కుమార్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థి సంఘం నాయకులు సన్నంకి మున్నా, వెంకటేశ్‌ చౌహాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ల్యాబ్‌ పరికరాలు, మెటీరియల్‌ ఇవ్వకుండా వేధించడం సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో సర్వసాధారణమని ఆరోపించారు. ఇదిలా ఉండగా 2013లోనే వాసు అనే మరో విద్యార్థి గైడ్‌ వేధింపులకు తాళలేక పిహెచ్‌డి మూడవ సంవత్సరంలో వదిలేసి తఇతర కోర్సులకోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

 

మరిన్ని వార్తలు