సిలబస్‌పై సమ్మెటివ్‌!

23 Aug, 2017 02:00 IST|Sakshi
సిలబస్‌పై సమ్మెటివ్‌!

సజావుగా సమ్మెటివ్‌ పరీక్షలు జరిగేనా?
సకాలంలో సిలబస్‌ పూర్తికావడం కష్టమే
ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు
సెప్టెంబర్‌ 11 నుంచి ప్రారంభం కానున్న సమ్మెటివ్‌ పరీక్షలు
సిలబస్‌ పూర్తయిన మేరకే ప్రశ్నాపత్రాలను తయారుచేయాలి
ఉపాధ్యాయ సంఘాల వినతి


కడప ఎడ్యుకేషన్‌ : అటు విద్యార్థుల్లోనూ, ఇటు ఉపాధ్యాయుల్లోనూ సమ్మెటివ్‌ పరీక్షల టెన్షన్‌ ఎక్కువైంది. మరో 20 రోజుల్లో పరీక్షలు ఉండటంతో సిలబస్‌పై భయం మొదలైంది. పరీక్షల నాటికి ఎట్లాగైనా సిలబస్‌ పూర్తిచేయాలని అధికారులు వెంటపడుతుండటంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వరుస పండగలు, సెలవుల నేపథ్యంలో బోధన కదలని పరిస్థితి. సిలబస్‌ లక్ష్యం పూర్తిపై ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బోధన గాడితప్పడానికి బదిలీలే కారణమని సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలు ప్రారంభమైన జూన్‌ నెల నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ ఉపాధ్యాయులు బదిలీల గొడవల్లో మునిగి తేలారు. బదిలీల కోసం దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఎవరెవరికి ఏ పాఠశాల వస్తుంది, ఏ పాఠశాల అయితే బాగుంటుంది ఇలా తర్జనభర్జలలో అయ్యవార్లు బిజిబిజీగా గడిపారు. దీంతో జూన్‌ 12 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ జరిగిన అయ్యవార్ల బదిలీల గొడవలో విద్యార్థుల చదువులు అటకెక్కాయి. బదిలీల ప్రక్రియలో భాగంగా వరుసగా స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు, పీడీలు, ఎల్‌పీలు, ఎస్‌జీటీల స్థానచలనాలు మొత్తం ఈనెల 10వ తేదీ వరకు సాగాయి.

వరుసగా సెలవులు
మొదటగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు ఆగస్టు 1వ తేదీన వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరిపోయారు. ఆతర్వాత ఎస్‌జీటీలు మిగతా ఉపాధ్యాయులు ఆగస్టు 11న తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరిపోయారు. తీరా విధుల్లో చేరిన వారం పదిరోజులకే మళ్లీ నాలుగు రోజులపాటు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. తర్వాత తిరిగి పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు నాలుగు రోజులు పాఠాలు చెప్పాగానే మళ్లీ ఆదివారం వచ్చింది. తిరిగి 21, 22 తేదీలలో ఉపాధ్యాయులకు టెలీ కాన్ఫరెన్సు పేరుతో రెండు రోజులు కాలాన్ని హరించేశారు. బోధనపై దృష్టిసారించేలోపు మళ్లీ శుక్రవారం రోజు వినాయక చవితి శనివారం అదివారం ఇలా రోజులన్నీ సెలవులతో ముగిసిపోనున్నాయి. మరేమో ఇచ్చేనెల 11వ తేదీ నుంచి 1 నుంచి 9వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు సమ్మెటివ్‌ పరీక్షల నిర్వాహణ ప్రభుత్వం తేదీని ప్రకటించింది.

సిలబస్‌ చూస్తే పదిశాతం కూడా పూర్తి కాని పరిస్థితి. బోధన అంతంతమాత్రమే. సమ్మెటివ్‌ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఈ 20 రోజులు సెలవులు లేకుండా బోధన సాగితేనే కొంతైనా విద్యార్థులు పరీక్షలు రాయగలరు. మరి ఉపాధ్యాయులు అంత బాధ్యతగా సిలబస్‌ పూర్తి చేస్తారా.. అనేది అనుమానామే. మరి అధికారులు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. కాగా పూర్తయినంత సిలబస్‌ మేరకే సమ్మెటివ్‌ ప్రశ్నపత్రాలను ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
జిల్లాలో ఇంకా కొన్ని పాఠశాలల్లో సజ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇందులోభాగంగా హిందీకి సంబంధించి 28 మంది, తెలుగుకు 44 మంది, సోషల్‌కు 35 మంది, గణితానికి 15మంది, ఫిజికల్‌ సైన్సుకు ఐదుగురు, బయలాజికి 15 మంది చొప్పున ఉపాధ్యాయుల కొరత ఉంది.

మరిన్ని వార్తలు