అధికారులు తీరు మార్చుకోవాలి...

4 Aug, 2016 22:17 IST|Sakshi
అధికారులు తీరు మార్చుకోవాలి...
  • భూమి కొనుగోలుపై ఇంత నిర్లక్ష్యమా?
  • ట్యాంకర్ల బిల్లులు చెల్లించాలి
  • స్థాయీ సంఘం సమావేశంలో సభ్యులు 
  • కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకంపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.సర్వర్‌పాషా, సారంగాపూర్‌ జెడ్పీటీసీ భూక్య సరళ ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాపరిషత్‌ సమావేశమందిరంలో  చైర్‌పర్సన్‌ తుల ఉమ, సీఈవో సూరజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో 6వ స్థాయీ  సంఘ(సాంఘిక సంక్షేమ) సమావేశం చైర్మన్‌ గజ్జెల వసంత అధ్యక్షతన గురువారం జరిగింది. గ్రామాల్లో భూకొనుగోలు పథకంపై ప్రచారం చేపట్టకపోవడంతోనే భూములు ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని ఆరోపించారు. సాంఘికసంక్షేమ వెనుకబడిన వసతిగహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు శ్రద్ధచూపాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో వివరించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, తీరు మార్చుకోవాలని సూచించారు.
    –గ్రామీణాభివద్ధి సంఘ సమావేశంలో జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ జమీలోద్దీన్‌ అహ్మద్‌ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు పనులు పూర్తి చేసిన తరువాత  ఈఎండీ బకాయిలు  చెల్లించడంలేదన్నారు. గ్రామాల్లో అనర్హుల పేరిట ఆహారభద్రత కార్డులను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారని జెడ్పీటీసీలు వీరమల్ల చంద్రయ్య, ఆకుల శ్రీలత, ప్రీతి రఘువీర్‌సింగ్, గంట అక్షిత తెలిపారు.
    –వేసవిలో గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించేందుకు లీజుకు తీసుకున్న అద్దె బావులు, ట్యాంకర్ల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని సభ్యులు ఇప్పనపల్లి సాంబయ్య, ఎడ్ల సుగుణాకర్, కె.లచ్చిరెడ్డి, అరుకాల వీరేశలింగం, పి.సంజీవరెడ్డి తెలిపారు. 
    – కాల్వశ్రీరాంపూర్‌ జెడ్పీటీసీ లంక సదయ్య మాట్లాడుతూ మీర్జాంపేట, కొత్తపల్లి గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఫ్లోరైడ్‌ వాటర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 
    – ఎస్సారెస్పీ కెనాల్‌ పనుల్లో నాణ్యత లోపిస్తోందని సైదాపూర్, శంకరపట్నం జెడ్పీటీసీలు వెంకటరెడ్డి, సంజీవరెడ్డి చెప్పారు. వరదకాలువ తూములు ఏర్పాటుచేయాలని విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత అన్నారు. 
     జవాబుదారీగా ఉండండి
    –తుల ఉమ, జెడ్పీ చైర్‌పర్సన్‌
    ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందిస్తూ జవాబుదారీగా ఉండాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ సూచించారు. సమావేశాల్లో ఆయా శాఖల ప్రగతి నివేదికలను రూపొందించి బుక్‌లెట్‌ రూపేణ  పంపిణీ చేయాలన్నారు.
మరిన్ని వార్తలు