దమ్ముంటే రాజీనామా చేయించండి

6 Apr, 2017 22:56 IST|Sakshi
దమ్ముంటే రాజీనామా చేయించండి
- సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు గౌరు, ఐజయ్య సవాలు
-  సేవ్‌ డెమోక్రసీ నిరసనలను విజయవంతం చేయాలని పిలుపు 
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తమ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారన్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ఎందాకైనా వెళ్తామని స్పష్టం చేశారు.  తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌కు అక్కడి ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తే నానాయాగి చేసిన సీఎం.. ఇప్పుడు ఏకంగా తమ పార్టీ నుంచి నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. టీడీపీలో సమర్థులు లేకనే ఇచ్చారేమో చెప్పాలన్నారు. చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన మంత్రిని చేసుకున్నాడని, దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిపి గెలిపించాలన్నారు. మంత్రివర్గ విస్తరణలో అన్యాయానికి గురైన మైనార్టీలు, గిరిజనులు టీడీపీపై తిరగబడాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ మద్దయ్య, మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. 
నేడు సేవ్‌ డెమోక్రసీ నిరసనలు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం తీరుకు శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన సేవ్‌ డెమోక్రసీ నిరసనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతీ, యువకులు, నిరుద్యోగులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 
మరిన్ని వార్తలు