చిగురిస్తున్న ఆశలు

31 Jul, 2016 22:38 IST|Sakshi
చిగురిస్తున్న ఆశలు
  • సింగూర్‌లో పెరిగిన నీటి మట్టం
  • 3టీఎంసీలకు చేరిన వరదనీరు
  • రైతుల్లో ఆనందం
  • పుల్కల్‌:పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్‌ ప్రాజెక్ట్‌లోకి గతవారం రోజులుగా వరదనీరు వచ్చి చేరుతోది. దీంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. 30టీఎంసీల సామర్ధ్యం గల  ప్రాజెక్టులో వర్షాలు కురియని కారణంగా గత రెండేళ్లుగా  నీటిమట్టం అడుగంటిపోయింది. ఈ పరిస్థితుల్లో వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవలేదు. దీంతో ఇటీవల వరుసగా కురుస్తున్న చిరుజల్లులతోపాటు ఎగువ ప్రాంతమైన జహీరాబాద్‌, బీదర్‌లో భారీవర్షాలు కురవడంతో సింగూర్‌ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. గత పదిరోజుల్లోనే ఏకంగా మూడు టీఎంసీల నీరు  ప్రాజెక్ట్‌లోకి వచ్చింది.

    ప్రతిరోజు 3500 క్యూసెక్కుల నీరు ఎగువనుండి వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్‌ప్రాజెక్ట్‌ గత 15రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతోపాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా సింగూర్‌ ప్రాంత రైతులకు సాగునీరందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగానే ప్రాజెక్ట్‌ ఎడమ కాల్వ ద్వారా 35వేల ఎకరాలకు సాగునీరందించేందుకు గాను అవసరమైన చర్యలు చేపడుతోంది.

    ఇప్పటికే దాదాపు 85శాతం పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా గత ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల పథకం పనులు ఇటీవలే పూర్తిచేశారు. గత వారంలో భారీనీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు డ్రై ట్రయల్‌రన్‌ నిర్వహించి పరీక్షించారు. దీంతో సింగూర్‌ ప్రాజెక్ట్‌ నిండినట్లయితే ఈ ఖరీఫ్‌ నుంచే అందోల్‌, పుల్కల్‌, మునిపల్లి మండలాల పరిధిలోని 35 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు అవసరమైన కాల్వలను తవ్వారు.

    ప్రభుత్వం ఆశించిన మాదిరిగానే వర్షాలు  భారీగా కురియడంతో పూర్తిగా అడుగంటిపోయిన సింగూర్‌ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. రానున్న రెండు నెలల్లో ఇదే స్థాయిలో వర్షాలు కురిసినట్లయితే ప్రాజెక్ట్‌ సామర్థ్యం 30 టీఎంసీలకు గాను కనీసం 25టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్‌ శాఖకు చెందిన అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    31జేజిపి22: సింగూర్‌ ప్రాజెక్ట్‌లో పెరిగిన నీటిమట్టం
     

మరిన్ని వార్తలు