వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల రీకౌన్సెలింగ్‌ నిలుపుదల

6 Jun, 2017 10:28 IST|Sakshi

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వైద్య ఆరోగ్యశాఖ రీజినల్‌ కార్యాలయ పరిధిలోని నాలుగు జిల్లాల ఉద్యోగులకు ఆ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మీనా కుమారి ఆధ్వర్యంలో రీ కౌన్సెలింగ్‌ జరిగింది. అయితే రాత్రి ఉన్నఫలంగా అధికారులు రీకౌన్సెలింగ్‌ను నిలుపుదల చేశారు. దీంతో కౌన్సెలింగ్‌కు హాజరైన వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జేడీ మీనాకుమారి, కౌన్సెలింగ్‌కు హాజరైన అధికారులు వాహనం ఎక్కి బయటికి వెళ్లడానికి ప్రయత్నించారు.

అది చూసిన ఆగ్రహించిన ఉద్యోగులు తమ సంగతి ఏమి పట్టించుకోరా అంటూ వాహనానికి అడ్డుపడ్డారు. అక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఉన్న పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అడ్డువచ్చిన వారిని తొలగించుకుంటూ పోయారు. ఈ పరిణామాలపై అక్కడి ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. రీకౌన్సెలింగ్‌ రద్దు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు బదిలీలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం అందరిలో నెలకొంది. అలా కాదు పాత జాబితానే అమలు చేస్తారని ఒకరు....లేదు రీకౌన్సెలింగ్‌ కూడా తప్పుల తడకగా జరిగింది.. ఈ జాబితానే సిద్ధం చేస్తారని మరొకరు అనుకుంటున్నారు.

అలాగే అసలు కౌన్సెలింగే ఉండదని, జరిగిన కౌన్సెలింగ్‌ను పూర్తిగా రద్దు చేసి ఉద్యోగుల బదిలీలను ఏడాదికి పైగా అలాగే నిలుపుదల చేస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాగా, సోమవారం అధికారులు నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్‌ చేపట్టినట్లు చెప్పడం జరిగిందని, అయితే అదంతా పూర్తిగా అవాస్తవమని, లోలోపల ఏదో జరుగుతోందనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఇలా ఆ శాఖ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని వార్తలు