తృప్తి, ఓర్పుతోనే హృదయం పదిలం

25 Sep, 2016 23:21 IST|Sakshi
తృప్తి, ఓర్పుతోనే హృదయం పదిలం
–శాసన మండలి చైర్మన్‌ చక్రపాణియాదవ్‌
కర్నూలు(హాస్పిటల్‌): తృప్తి, ఓర్పుతోనే గుండె పదిలంగా ఉంటుందని శాసన మండలి చైర్మన్‌ చక్రపాణియాదవ్‌ అన్నారు. కర్నూలు హార్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో వరల్డ్‌ హార్ట్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చక్రపాణియాదవ్‌ మాట్లాడుతూ.. ఒకరినొకరు అభిమానించుకుని, గౌరవించుకోవాలన్నారు. అప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. మహాత్ముడు అహింసామార్గంలో బ్రిటిష్‌ వారిని తరిమికొట్టాడాని, ఆయన ప్రసాదించిన స్వాతంత్య్రాన్ని అదే దృష్టితో కాపాడుకోవాలని సూచించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మొదటిసారిగా ఓపెన్‌హార్ట్‌ సర్జరీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరల్డ్‌ హార్ట్‌ డేను కర్నూలులో మాత్రమే ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమన్నారు.  ఏపీ కార్డియాలజిస్ట్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ పి. రమేష్‌బాబు మాట్లాడుతూ.. హృదయాన్ని ప్రేమించడం నేర్చుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అనంతరం డాక్టర్‌ రమేష్‌బాబుకు విశిష్ట వ్యక్తిగా కర్నూలు హార్ట్‌ ఫౌండేషన్‌ పేర్కొంటూ శాసన మండలి చైర్మన్‌ చక్రపాణియాదవ్‌ చేతుల మీదుగా సన్మానించారు. ఆ తర్వాత  కుమారి అంజలి కూచిపూడి అభినయం ఆకట్టుకుంది. చివరగా హైదరాబాద్‌కు చెందిన గాయకులు  శరత్‌చంద్ర బృందం ఆలపించిన ఘంటసాల గీతాలు అలరించాయి. కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి, ఆంధ్రాబ్యాంక్‌ డీజీఎం గోపాలకృష్ణ, కర్నూలు హార్ట్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ పి. చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్‌ భవానీప్రసాద్, డాక్టర్‌ వసంతకుమార్, చంద్రశేఖర కల్కూర, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు