కారుచీకట్లో.. కమ్మేస్తున్న పొగలు

5 Apr, 2016 03:57 IST|Sakshi

విషం చిమ్ముతున్న పరిశ్రమలు
ఘాటైన విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి
రాత్రి అయ్యిందంటే నరకమే..

రాత్రి అయ్యిందంటే చాలు ఊపిరి ఆగిపోయినంత పనవుతోంది. ఘాటైన విష వాయువులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫార్మా, రసాయన పరిశ్రమలు విషం చిమ్ముతుండటంతో జనం తల్లడిల్లిపోతున్నారు. రాత్రి పది దాటితే చాలు.. సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, లెడ్ వంటి విష వాయువులను అడ్డగోలుగా వదలుతున్నారు. ఆరుబయట నిద్రించాలంటేనే జంకుతున్నారు. అసలే ‘మండు’ తున్న వేసవికాలం.. ఇంట్లో ఉక్కపోత.. బయట పొగల వాతతో నరకయాతన పడుతున్నారు. పారిశ్రామిక వాడలేకాక, జిల్లా అంతటా ఇదే దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చి ఒక్క క్షణం ఉంటే తాము పడుతున్న బాధ తెలుస్తుందని స్థానికులు అంటున్నారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్‌చెరు, పాశమైలారం పారిశ్రామిక వాడల్లో  కంపెనీల యాజమాన్యం రెచ్చి పోతున్నాయి.  రాత్రి అయితే చాలు..  ఫార్మా, స్పాంజ్, రసాయన పరిశ్రమల వాయు వ్యర్థాలను నేరుగా గాలిలోకి వదిలేస్తున్నారు. ప్రజా జీవనంపై అత్యంత ప్రభావం చూపే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, లెడ్ లాంటి విష వాయువులు ఇబ్బడిముబ్బడిగా విడుదలవుతున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పొగ గొట్టాల ద్వారా వాయువులను వదిలేస్తున్నారు. ఈ దొంగ తంతును నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారు. రాత్రి వేళలో వందలాది పరిశ్రమలు ఒకేసారి వాయువులను విడుదల చేయడంతో ఆ గాలులు పారిశ్రామిక వాడల పరిసరాలను దాటి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని తాకుతున్నాయి. ఆరుబయట పడుకుంటే..

రామచంద్రాపురం,పటాన్‌చెరు, జిన్నారం, సంగారెడ్డి, హత్నూరా, శివ్వంపేట, నర్సాపూర్ మండలాల పరిధిలోని గ్రామాల జనం విష వాయువులతో తల్లడిల్లిపోతున్నారు. వేసవి కాలం కావటంతో ఇంట్లో ఉక్కపోతకు, ఆరుబయట పరిశ్రమల విష గాలులకు తట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. సాధారణంగా  వేసవి కాలం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందటానికి పల్లె ప్రజలు ఆరుబయట పడుకుంటారు. కానీ పరిశ్రమల నుంచి వస్తున్న విషపు గాలులతో ఆరుబయట పడుకునే పరిస్థితి లేదు. సరిగ్గా ఐదు నిమిషాలు నిలబడి గాలి పీల్చే పరిస్థితి లేదు. ఫార్మా, రసాయన కంపెనీల నుంచి వస్తున్న నైట్రోజన్ డై ఆక్సైడ్‌తో కళ్లు, ముక్కులు మండిపోతున్నాయి.  ఆరుబయట పడుకుంటే తెల్లారే సరికి వాంతులు, విరోచనాలు , తీవ్రమైన చిరాకుకు లోనవుతున్నారు.

ఇక్కడి గాలి  అంతా విషమే...
నిబంధనల ప్రకారం సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ 80 మైక్రో గ్రాముల వరకు మాత్రమే  ఉండాలి, వాస్తవానికి అదికూడా ఎక్కువే. సీసం 1.5, కార్భన్ మోనాక్సైడ్ 5 మైక్రో గ్రామల వరకు ఉండొచ్చు. కానీ పాశం మైలారం, పటాన్‌చెరు, సంగారెడ్డి పారిశ్రామిక వాడలపరిసర ప్రాంతాల్లోని నివాస పల్లెల్లో  సల్ఫర్ డయాక్సైజ్,  నైట్రోజన్ ఆక్సైడ్  పరిమాణం  101 నుంచి  140  మైక్రో గ్రాముల  కంటే ఎక్కువగా ఉన్నట్లు పీసీబీ నివేదికలు చెబుతున్నాయి. సీసం, కార్భన్ మోనాక్సైడ్ పరిమాణం కూడా 5 మైక్రో గ్రామల కంటే ఎక్కువగానే ఉన్నట్లు రికార్డు అయింది. వాస్తవానికి ఈ నివేదికల్లో కూడా లోపాలు ఉన్నాయి. వాస్తవంగా పరిశ్రమల నుంచి వస్తున్న వాయు కాలుష్యాన్ని  అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు.

 యాజమాన్యాల ఇష్టారాజ్యం
వాస్తవానికి  వాయువుల విష గాఢతను  అంచనా వేయడానికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు  ప్రతి ఫార్మా, రసాయన పరిశ్రమ పొగ గొట్టం చివరన కాలుష్య నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ శాస్త్రీయ పరికరాన్ని తాకుతూ పొగ వెళ్తే... ఆ పొగలో ఉన్న విష వాయువులు, వాటి పరిమాణంను గుర్తించి రికార్డు చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వాయు వ్యర్థాలను విడుదల చేసిన పరిశ్రమలపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కంపెనీల యాజమాన్యం  పొగగొట్టం మధ్యలోనే ఒక భారీ రంధ్రాన్ని ఏర్పాటు చేసి వాయువులను దారి మళ్లిస్తున్నారు. దీంతో  విష వాయువుల గాఢత రికార్డు కాకుండా పోతోంది.

మరిన్ని వార్తలు