జిల్లాలో విస్తారంగా వర్షాలు

8 Sep, 2017 22:57 IST|Sakshi
జిల్లాలో విస్తారంగా వర్షాలు

- అనంతపురం, బొమ్మనహాల్‌లో భారీ వర్షం
- వారం రోజుల్లోనే 71 మి.మీ వర్షపాతం నమోదు


అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పగలు ఎండ, రాత్రి వానతో గత వారం రోజులుగా పది మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. 71 మి.మీ భారీ వర్షపాతం నమోదయ్యింది.  సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 71.3 మి.మీ నమోదైంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 55 మండలాల పరిధిలో 10.4 మి.మీ సగటు వర్షం కురిసింది. అందులో అనంతపురం, బొమ్మనహాల్‌ మండలాల్లో అత్యధికంగా 48.9 మి.మీ చొప్పున వర్షం పడింది.

రొద్దం, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, రాయదుర్గం, కూడేరు తదితర ఏడెనిమిది మండలాల్లో వేరుశనగ, ఆముదం, పత్తి, మిరప, టమోటా, కర్బూజా, కళింగర లాంటి పంటలకు రూ.70 లక్షల నుంచి రూ.ఒక కోటి వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం కూడా గుత్తిలో గుడిసె కూలబడి 20 గొర్రెలు మృత్యువాతపడ్డాయి.  వారం రోజులుగా జిల్లా అంతటా వర్షం పడుతున్నా ఎన్‌పీకుంట మండలంలో కేవలం 12.9 మి.మీ, బ్రహ్మసముద్రం మండలంలో 16.9 మి.మీ, యల్లనూరులో 27.9 మి.మీ మాత్రమే కురిసింది. అలాగే రొళ్ల, గోరంట్ల, మడకశిర, గుమ్మగట్ట, తలుపుల, తనకల్లు, రాయదుర్గం, ఉరవకొండ, యాడికి మండలాల్లో కూడా వర్షపాతం 50 మి.మీ లోపు నమోదైంది.

మరిన్ని వార్తలు