భారీ వర్షంతో అతలాకుతలం

30 Aug, 2016 01:27 IST|Sakshi

మిర్యాలగూడ : భారీ వర్షం మిర్యాలగూడ నియోజకవర్గంలో అతలాకుతలమైంది. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి తెల్లవారే వరకు వర్షం కురిసింది. దాంతో చెరువులు పూర్తిగా నిండాయి. మిర్యాలగూడ పెద్ద చెరువులో చుక్క నీరు లేకుండా ఉండగా ఒక్క రాత్రికే చెరువు నిండింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని హనుమాన్‌పేట, రెడ్డికాలనీ, ముత్తిరెడ్డి కుంట, బంగారుగడ్డ, హౌజింగ్‌బోర్డు కాలనీలలో భారీగా వర్షపు నీరు నిలిచింది. దాంతో పాటు గాంధీ పార్కు పాఠశాలలో భారీగా వర్షపునీరు చేరింది. దాంతో ప్రజలు రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హనుమాన్‌పేటలో ఉన్న గుడిసె వాసులు ఇండ్లలోకి నీరు చేరింది.
రాకపోకలకు అంతరాయం
భారీ వర్షం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ నుంచి తడకమళ్లకు వెళ్ల ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి, తడకమళ్ల సమీపంలోని కల్వర్టుల మీదుగా నీరు ప్రవహిస్తుండం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి పాఠశాలలో వర్షపు నీరు చేరి చెరువును తలపించేలా ఉంది.
అధికారుల పట్టింపు లేకనే నష్టం
పట్టణంలోని హనుమాన్‌పేటలోని సీఐటీయూ కార్యాలయం వెనుకభాగంలో ఉన్న గుడిసెల్లోకి వర్షపు నీరు చేరడంతో సామగ్రి పూర్తిగా తడిసిపోయిందని వార్డు కౌన్సిలర్‌ బావండ్ల పాండు పేర్కొన్నారు. సోమవారం హునుమాన్‌పేటలోని నీటమునిగిన గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ గతంలో కూడా ఎన్నో పర్యాయాలు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు చెప్పినా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకపోవడం వల్లనే గుడిసెల్లోకి నీరు చేరిందన్నారు. ఆయన వెంట సైదులు, తిరుపతయ్య, సంగయ్య, జయమ్మ, రాంబాబు, మహేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు