నల్లగొండ జిల్లాలో అత్యధిక వర్షపాతం

13 Sep, 2016 19:30 IST|Sakshi

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేకచోట్ల కుంభవృష్టి నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో నల్లగొండ, దేవరకొండల్లో 9 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం రికార్డు అయింది. మిర్యాలగూడ, మాచిరెడ్డి, కంపాసాగర్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రామాయంపేట, మెదక్, జగిత్యాల్, ఆదిలాబాద్, గాంధారిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.

ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 665.2 మిల్లీమీటర్లు కాగా... ఇప్పటివరకు 640.4 మిల్లీమీటర్లు కురిసింది. నల్లగొండ జిల్లాలో 23 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా... మెదక్ జిల్లాలో 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వచ్చే నెల నుంచి రబీ సీజన్ మొదలు కానుండటంతో ఇప్పుడు కురిసే వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లోకి మరింత నీరు వచ్చి చేరే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితి రబీ పంటలకు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు