వర్షం దండీ

15 Sep, 2016 22:41 IST|Sakshi
పాపన్నపేటలో పొంగుతున్న ఘణపురం ప్రాజెక్టు

పొంగిపొర్లిన చెరువులు, కుంటలు
జిల్లా అంతటా 30 మి.మీ. వర్షపాతం నమోదు
సిద్దిపేట, నర్సాపూర్‌ లో దెబ్బతిన్న ఇళ్లు
నారింజ వాగులోకి భారీగా వరదనీరు

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో గురువారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది.  వర్షం ధాటికి సిద్దిపేట, మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. జిల్లా అంతటా 30 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదైంది. న్యాల్‌కల్‌ మండలంలో అత్యధికంగా 78 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

రాయికోడ్, మనూరు, ములుగు మండలాల్లో 60 మి.మీ, జహీరాబాద్, అందోలు, చిన్నకోడూరు, పుల్కల్‌ మండలాల్లో 40 నుంచి 50 మి.మీ. వర్షం కురిసింది.  సిద్దిపేట పట్టణంలో భారీగా వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఒక ఇల్లు కూలిపోయింది.  నంగనూరు మండలంలో వర్షం కారణంగా 27 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సిద్దిపేట మండలంలో 122 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

చిన్నకోడూరులో భారీగావర్షం కురవటంతో చెరువుల, కుంటలు, చెక్‌డ్యాంలలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. నర్సాపూర్‌ నియోజకవర్గంలో భారీగా వర్షం కురవటంతో చెరువులు, కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. నర్సాపూర్‌ మండలంలో పాక్షికంగా 25 ఇళ్లు దెబ్బతినగా వెల్దుర్తి మండలంలో 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

గజ్వేల్‌ నగర పంచాయతీలో రెండు ఇళ్లు దెబ్బతినగా లోతట్టు ప్రాంతాల్లోని శివాలయం వీధి, సిరి ఎన్‌క్లేవ్‌ ప్రాంతంలో ఇళ్లులోకి వర్షం నీళ్లు వచ్చాయి. గజ్వేల్‌ మండలంలో రెండు ఇళ్లు కూలాయి. కొండపాక మండలంలో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి, పటాన్‌చెరు, జోగిపేట, నారాయణఖేడ్, మెదక్‌ నియోజకవర్గాల్లో వర్షం కురిసింది.

వర్షంతో ఆయా నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. జహీరాబాద్‌ సమీపంలోని నారింజగవాగులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నారింజవాగు పొంగి పొర్లుతోంది. వర్షంతో జహీరాబాద్‌ మండలంలో ఏడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

>
మరిన్ని వార్తలు