ఏజెన్సీలో భారీ వర్షాలు

6 Aug, 2013 02:49 IST|Sakshi

పాడేరు, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపై జనసంచారం స్తంభించింది. పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో సోమవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పెదబయలు, జి.మాడుగుల మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని ప్రధాన గెడ్డల్లో నీటి ప్రవాహం అధికమైంది. మత్స్యగెడ్డ, బొయితిలి గెడ్డ, గుల్లెలు సమీపంలోని పెద్దగెడ్డ, హుకుంపేట మండలంలోని రాళ్ల గెడ్డలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి.

 

ఆయా గ్రామాల గిరిజనులు గెడ్డలను దాటేందుకు భయపడుతున్నారు. మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు జలాశయంలో నీటి నిల్వలు పెరిగాయి. సోమవారం పెదబయలు, అన్నవరం వారపు సంతలకు ఈ వర్షంతో ఆటంకం ఏర్పడింది. గిరిజనులు, వ్యాపారులు వర్షంలో తడిసిముద్దయ్యారు. వ్యాపా ర లావాదేవీలు అంతంత మాత్రంగానే జరిగాయి. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి మేలు చేస్తాయని ఐటీడీఏ వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.  ముంచంగిపుట్టు మండలంలో సోమవారం 43.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు