భారీ వర్షం.. అపార నష్టం

1 Oct, 2016 19:03 IST|Sakshi
చేలల్లోంచి పారుతున్న వరద నీరు

నారాయణఖేడ్‌: నియోజకవర్గాన్ని మళ్లీ భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీగా ఆస్తినష్టం మిగిల్చింది. వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఒక్క రోజు ఇంత మేర వర్షం కురవడం ఇదే మొదటిసారి. శనివారం తెల్లవారు జామున వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెరపి ఇచ్చినా మళ్లీ సాయంత్రం మొదలయ్యింది.

నారాయణఖేడ్‌ మండలంలో 11.9 సెంటీ మీటర్ల వర్షం పడింది. గంగాపూర్‌ మొండి మత్తడి, తుర్కాపల్లి పటేల్‌ చెరువులకు గండ్లు పడ్డాయి.నీరంతా వృథాగా పోయింది. మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పక్షం రోజులుగా వర్షాలు, వరదల వల్ల పంటలన్నీ దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కంది, పెసర, మినుము, సోయా, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటలు నీట మునిగి కుళ్లిపోయాయి. నారాయణఖేడ్‌ పట్టణ శివారులో గల వాగు పొంగి ప్రవహించింది. కంగ్టి, సిర్గాపూర్‌- నారాయణఖేడ్‌ రూట్లో నెహ్రూ నగర్‌- మన్సుర్‌పూర్‌ గ్రామాల మధ్య ఉన్న వంతెనపై నుంచి ఐదు అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహించింది. దీంతో వంతెన వద్ద గల రోడ్డు కొట్టుకుపోయింది. ఫలితంగా నారాయణఖేడ్‌- కంగ్టి, సిర్గాపూర్‌ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న రోడ్డును అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు