రౌడీకి పెత్తనమా?

11 May, 2017 22:58 IST|Sakshi
రౌడీకి పెత్తనమా?
- భయపెట్టడం ఆయన నైజం
- ఓడిపోవడం ఆయన చరిత్ర
- ఎదురూరుపై కొత్తకోట విమర్శ
కోడుమూరు రూరల్‌: కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా ఒక రౌడీకి పెత్తనం అప్పజెప్పారని వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ గవర్నింగ్‌ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన కోడుమూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్వంత ఊరిని బాగు చేసుకోలేని ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటూ ప్రజలకు హామీలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లను, అధికారులను భయపెట్టి సుమారు రూ.10కోట్లకు పైగా కమిషన్లను దండుకున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. సొంత తల్లికి, తమ్ముడికి అన్నం పెట్టని విష్ణువర్ధన్‌రెడ్డి ప్రజలకు ఏమి మేలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికారంలో ఉండే పార్టీకి కొమ్ముకాయడం ఒక్క విష్ణుకే చెల్లుబాటవుతుందన్నారు. ఆరు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చర్రిత ఆయనకే దక్కుతుందన్నారు. విష్ణువర్దన్‌రెడ్డిపై 60కిపైగా కేసులున్నాయని, అటువంటి వ్యక్తికి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం అప్పజెప్పడం శోచనీయమన్నారు.
 
నీటి సమస్యను పరిష్కరిస్తాం...
 కోడుమూరు మండలంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కర్నూలు పార్లమెంట్‌ సభ్యురాలు బుట్టా రేణుక రూ.65కోట్ల నాబార్డు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపారని కోత్తకోట తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఎంపీ ని«ధులు రూ. కోటి 25 లక్షలతో నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించామని, అలాగే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.. సమావేశంలో ఎంపీపీ కోట్ల వంశీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ముల్లా సలీం, కోడుమూరు, కర్నూలు మండలాల వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు డీలర్‌ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి సుభాకర్, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌ మండలాల నాయకులు లింగారెడ్డి, గిడ్డయ్య, రామకృష్ణ, యోగీశ్వరరెడ్డి, రామగిడ్డి,  నరసింహారెడ్డి, సుందరం, విట్టల్, రఘురెడ్డి, ఎర్రన్న, మధు, బాలముని తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు