హలో.. 108.. కుయ్యోముర్రో!

23 Sep, 2016 17:55 IST|Sakshi
హలో.. 108.. కుయ్యోముర్రో!
* జిల్లాలో సక్రమంగా అందని 108 వాహన సేవలు
* నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టు సంస్థ
* పట్టించుకోని ప్రభుత్వం 
* అవస్థలు పడుతున్న రోగులు
 
రోడ్డు ప్రమాదాల్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అనేక ప్రాణాలను ఆపన్నహస్తం అందించి ఆయుషుపోసే అపర సంజీవని 108.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై కుయ్యోమొర్రో అంటుంది. సహాయమంటూ కాల్‌ చేస్తే ప్రస్తుతం ఏ వాహనమూ అందుబాటులో లేదంటూ వాయిస్‌ వినిపిస్తూ రోగుల సేవల నుంచి తప్పుకుంటుంది. దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టు సంస్థ కనీసం డీజిల్‌ కూడా పోయించకుండా చేతులెత్తేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది
 
తెనాలి అర్బన్‌: వైద్యం అందక ఏ ఒక్క ప్రాణం గాలిలో కలిసిపోకూడదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో 108 సర్వీస్‌లను ప్రారంభించారు. ఆ సమయంలో వీటి బాధ్యతలను సత్యం సంస్థలకు అప్పగించారు. ఆ తర్వాత పరిణమాలతో ఆ బాధ్యతలు జీవీకే సంస్థ తీసుకుంది. అప్పటి నుంచి వాహనాల నిర్వహణ, మందులు, దానిలో పనిచేసే పైలెట్, టెక్నీషియన్‌ల వేతనాలు వంటి వాటిని సదరు సంస్థ నిర్వహిస్తోంది. అయితే జీవీకే సంస్థ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అది కాకుండా ఇటీవల జరిగిన 108 నిర్వహణ టెండర్లను బీవీజీ అనే సంస్థ దక్కించుకుందనేది సమాచారం. దీంతో  జీవీకే సంస్థ వీటి నిర్వహణ బాధ్యతలను గాలికొదిలేసింది. దీంతో కొన్ని వాహనాలు మూలనపడ్డాయి. తెనాలిలో రెండు వాహనాలు ఉండగా ఒక దానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేదు. దీంతో దానిని గుంటూరు తరలించారు. ప్రస్తుతం తెనాలిలో ఒక్క వాహనమే సేవలందిస్తోంది.
 
సేవలను కుదిస్తున్న 108..
108 సేవలు ప్రారంభించిన సమయంలో ఎక్కడి నుంచి అయిన రోగిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం ప్రభుత్వ వైద్యశాలలకు మాత్రమే తీసుకెళ్లాలనే నిబంధన పెట్టారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో బాధితులు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. 
 
డీజిల్‌లేక నిలిచిపోతున్న వాహనాలు
జిల్లా పరిధిలో 35 వాహనాల ద్వారా ప్రతి రోజు 160 మంది పేదలకు సేవలందిస్తారు. వీటికి డీజిల్‌ జీవీకే సంస్థ అందించాలి. దీని కోసం సమీపంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వారితో ఒప్పందం చేసుకోవాలి. పైలెట్లు ప్రతి రోజూ ఒక్కో వాహనంలో రూ.2 వేల నుంచి 2,500 వరకు డీజిల్‌ నింపుకుంటారు. ఆ నగదును అదే రోజు పెట్రోల్‌ బంక్‌ వారికి జీవీకే సంస్థ చెల్లిస్తుంది. సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి మాత్రం ఏ ఒక్క వాహనానికి yీ జిల్‌ నగదు జమ చేయలేదు. దీంతో పైలెట్లు పెట్రోల్‌ బంక్‌ యజమానులతో మాట్లాడి రూ. 500 నుంచి రూ.1000లోపు డీజిల్‌ను పోయించుకుంటున్నారు. దీంతో ఒక్కో వాహనం ఇప్పటికే రూ.20 వేలకుపైగా పెట్రోల్‌ బంక్‌ వారికి బకాయిలు పడింది. దీంతో బంక్‌ నిర్వాహకులు డీజిల్‌ ఇవ్వలేమనే సంకేతాలు ఇవ్వడంతో వాహనంలో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు చెప్పినా డీజిల్‌ పోస్తే వాహనం నడపండి లేకపోతే దానిని అపివేయండనే అనధికార ఆదేశాలు ఇస్తున్నారు. 
 
డీజిల్‌ కొరత వాస్తవమే..
108 వాహనాలకు డీజిల్‌ కొరత ఏర్పడుతున్న మాట వాస్తవం. వాహనాల కాలపరిమితి దాటి పోవటం(5 లక్షల కిలోమీటర్లు తిరగటం) వల్ల తరచూ రిపేరు వస్తున్నాయి. చిన్నపాటి రిపేరైతే అప్పుడే చేయిస్తున్నాం, మిగిలిన వాటికి కొద్ది రోజుల సమయం తీసుకుంటున్నాం. అలాంటి సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం.
– రాజేంద్రప్రసాద్‌, జిల్లా ప్రమోషనల్‌ మేనేజర్‌
>
మరిన్ని వార్తలు