బ్యాంకుల వద్ద హెల్ప్‌డెస్క్‌లు

12 Dec, 2016 15:01 IST|Sakshi
బ్యాంకుల వద్ద హెల్ప్‌డెస్క్‌లు

మచిలీపట్నం : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా పారా లీగల్‌ వాలంటీర్లతో వారికి సేవలు అందించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు చెప్పారు. బుధవారం జిల్లా జడ్జి తన చాంబర్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారులు నగదు డిపాజిట్, తీసుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పారా లీగల్‌ వాలంటీర్లను బ్యాంకుల వద్ద ఉంచి నగదు డిపాజిట్‌ చేసే సమయంలో, తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంతోపాటు సంబంధిత ఫారాలను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బుధవారం నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయని, అవసరమైనన్ని రోజులు ఈ సేవలు అందజేస్తామన్నారు. మచిలీపట్నం ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్, ఆంధ్రాబ్యాంక్‌ ఫౌండర్స బ్రాంచ్, సిండికేట్‌ బ్యాంక్, గూడూరులో ఎస్‌బీఐ బ్యాంక్, పెడనలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ వద్ద పారాలీగల్‌ వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని 11 మండల న్యాయసేవాధికార కమిటీల పరిధిలోని బ్యాంకుల వద్ద పారాలీగల్‌ వాలంటీర్ల సేవలను అందజేస్తామన్నారు. నగదు డిపాజిట్‌ చేసే సమయంలో దళారీల ప్రమేయం లేకుండా పారాలీగల్‌ వాలంటీర్లు చూస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్‌ రాజీవ్‌ పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు