'గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి'

23 Aug, 2015 01:04 IST|Sakshi
'గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి'

శ్రీశైలం ప్రాజెక్టుః గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని, వారి చదువుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని ఐటీడీఏ పీఓ ఈసా రవీంద్రబాబు అన్నారు. శనివారం ఉపాధ్యాయుల శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది. ఐటీడీఏ తరుపున నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న జీపీఎస్ పాఠశాలలపై వరాల జల్లు కురిపించారు. స్థానిక స్వచ్చంద సంస్థ నల్లమల సొసైటీ తమ సేవలను అందిస్తున్నారని ఉపాధ్యాయులు సక్రమంగా వినియోగించుకుని వారి సూచనల మేరకు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాలలలో మేజర్ల రిపేర్లు ఐటీడీఏ చేయిస్తుందని, వాటికి సంబంధించిన వివరాలు, ప్రతిపాదనలు వారంలోగా పంపాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులతో సత్కరించే ఆలోచనలో ఉన్నామన్నారు. అలాగే బాలల దినోత్సవం రోజున ప్రతి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని జరపాలని, స్థానిక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులను, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చేయాలని సూచించారు. వివిధ పాఠశాలలో అవలంభిస్తున్న అసెంబ్లీ, ప్రార్థన గీతాలు, జాతీయగీతం తప్పనిసరిగా అమలు చేయాలని, వీటి కోసం అవసరమైన సంగీత వాయిద్య పరికరాలను ఐటీడీఏ సమకూరుస్తుందన్నారు. ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులపై అధికారులు అనుమతిని తమ దృష్టికి తీసుకురావాలని నెలలతరబడి పాఠశాలలకు రాని ఉపాధ్యాయులపై అధికారులు, ఆధారాలతో తెలియజేయాలని సూచించారు. ఆలా తెలియజేస్తే క్రమశిక్షణ చర్యలలో భాగంగా వేతనాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. అయితే చెంచు విద్యార్థులు విద్యాభివృద్ధి జరగాలనే ఆశయంతోనే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు