కోళ్లు కుతకుత

13 Apr, 2016 03:09 IST|Sakshi
కోళ్లు కుతకుత

ఎండ వేడిమికి విలవిల
ఎక్కడికక్కడ మృత్యువాత
పౌల్ట్రీ రైతుల కుదేల్
మూతపడ్డ పరిశ్రమలు

భానుడి ప్రతాపంతో పౌల్ట్రీ విలవిల్లాడుతోంది.  వడ దెబ్బకు కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. కోడి ఎదుగుదల లేక.. ధర రాక రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికే చాలా పౌల్ట్రీ ఫారాలు మూతపడ్డాయి. చేసిన అప్పులు మిగిలి పోయాయి. పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన రైతన్న సర్కార్ సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు.  - మెదక్

ఎండ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. భానుడి భగభగలకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే కరువుతో వ్యవసాయం మూలనపడటంతో కొందరు రైతులు ఫారాలు ఏర్పాటుచేసుకున్నారు. వాటి నిర్వాహకులు దిక్కుతోచని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత నుంచి  కోళ్లను కాపాడుకునేందుకు ఫారాల్లో ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి చల్లటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అయినా రైతుల కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఎండను తట్టుకోలేక కోళ్లు చనిపోతూనే ఉన్నాయి. మిగిలిన కోడి పిల్లల్లో ఎదుగుదల లేక రైతన్న లబోదిబోమంటున్నాడు.

 కోళ్ల బరువు ఆధారంగా పౌల్ట్రీ రైతులకు కమీషన్ వస్తుంది. వేసవి కారణంగా ఎండ తీవ్రతకు కోళ్లలో పెరుగుదల నిలిచిపోయింది. ఫలితంగా వా రికి వచ్చే లాభం పూర్తిగా తగ్గిపోతోంది. చేసిన కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఫలితంగా అనేక కోళ్లఫారాళ్లు మూతపడ్డాయి. ఒక్క ఫారాన్ని నడపాలంటే కనీసం ముగ్గురు పనివాళ్లు ఉండాలి. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల చొప్పున ముగ్గురికి రూ.30 వేల జీతాలు ఇవ్వాలి. ఒక్కో బ్యాచ్ ను 45 రోజులపాటు పెంచుతారు. ఫారం అడుగు భాగాన వడ్ల చిట్టు(పొట్టు) వేయాలి. దానికి రూ.10 వేల వరకు వెచ్చించాలి. ఇక కరెంట్ మీటర్లు వ్యాపారం కింద కేటగిరి -2 కింద బిగించటంతో నెలకు రూ.3 వేల వరకు బిల్లు వస్తుంది.

ఇవన్నీ ఖర్చులు భరించాలం టే కోళ్లు ఏపుగా పెరిగి ఒక్కో కోడి 2.30 కిలోల నుంచి 3కిలోల బరువు పెరిగితేనే రైతుకు కొంత లాభం వస్తుంది. గత రెండు నెలలుగా కేవలం 1.50 కిలోలకు మించి బరువు పెరగడం లేదని, దీంతో పనివాళ్లకు జీతాలు ఇచ్చేపరిస్థితి లేకుండా పోయిం ది. ఇప్పటికే జిల్లాలో అనేక పౌల్ట్రీలను మూసివేశారు. పౌల్ట్రీల ఏర్పాటు కోసం రైతులు బ్యాంకుల్లో లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఎండ తీవ్రత కారణంగా తీవ్రనష్టం వస్తుండటంతో అవి మూత పడుతుండగా బ్యాంకు రుణాలు ఎలా తీర్చాలో తెలియక జిల్లాలోని అనేక మంది పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు.

మిగిలింది అప్పులే..
రెండు నెలలుగా ఎండ తీవ్రతతో కోళ్ల బరువు పెరగడంలేదు. అదీగాక ఎండకుతట్టుకోలేక కోళ్లు చనిపోతున్నా యి. ఫారం నిర్మాణానికి రూ.4 లక్షల అప్పులు చేశా. నెలన్నరపాటు ఒక్క బ్యాచిని పెంచితే నష్టం తప్ప లాభం రాలేదు. కోళ్లఫారాల్లో ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయటంతో కరెంట్ బిల్లు నెలకు రూ.3వేలపైనే వస్తుంది. పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి.
- గందె శ్రీనివాస్,  పౌల్ట్రీ రైతు, ఔరంగాబాద్

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు