వారి ధనదాహం.. వీరికి శాపం

7 Sep, 2016 17:54 IST|Sakshi
వారి ధనదాహం.. వీరికి శాపం
* తెలుగు తమ్ముళ్ల అత్యాశే 
చిన్నారుల మృతికి కారణం
 
చిలకలూరిపేట టౌన్‌: తెలుగు తమ్ముళ్ల మితిమీరిన ధనదాహం ఇద్దరు చిన్నారుల మృతికి కారణ మైంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందే తడవుగా చెరువుల అభివృద్ధి పేరు మాటున అధికార పార్టీ నాయకులు జేబులు నింపే నీరు–చెట్టు పథకానికి తెరతీశారు. నిబంధనలకు నీళ్లు వదులుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఈ వ్యవహారం చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ యథేచ్ఛగా కొనసాగింది. ఏ చెరువును ఎంతమేరకు తవ్వాలనే నియమాలేవీ పాటించకుండా ఎంత మట్టి తవ్వాం, జేబులు ఎంత నిండాయనే రీతిగా ఈ తతంగం కొనసాగింది. ఒకసారి తవ్విన చెరువునే రెండోసారి తవ్వడం, మట్టివిక్రయాలు చేయడం మండలంలోని మైదవోలు గ్రామ సమీపంలో 56 ఎకరాలలో విస్తరించి ఉన్న సీతమ్మ చెరువులో జరిగింది. ఈ అడ్డగోలు తతంగం చివరకు ఇద్దరు చిన్నారుల మృతికి కారణమై రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం బడినుంచి వచ్చిన చిన్నారులు ధర్నాసి ప్రహర్షిత (6), జొన్నలగడ్డ సరస్వతి (7) చెరువు కట్టపై ఆడుకుంటూ జారిపడి నీటిలో మునిగి మృతి చెందారు. 
 
కలకలం రేపిన విషాదం..
సీతమ్మ చెరువును గత ఏడాది వేసవిలో నీరు–చెట్టు పథకం ద్వారా తవ్వకాలు జరిపారు. వర్షాలు లేకపోవడం, చెరువులో నీరు చేరక పోవడంతో తిరిగి ఈ ఏడాది వేసవిలో చెరువులో మరోమారు తవ్వకాలు నిర్వహించారు. ఒకసారి తవ్విన చెరువును రెండోసారి తవ్వకాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేది జగమెరిగిన సత్యం. కేవలం ధనదాహంతో మట్టివిక్రయాలు చే సేందుకే తవ్వకాలు జరిగాయనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడం ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమేరకు మాత్రమే చెరువులో నీళ్లు చేరాయి. స్వయానా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో సుమారు 50 చెరువులలో మట్టితవ్వకాలు జరిగాయి. వీటిలో చాలా చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతు తవ్వకాలు జరిగినట్టు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.  చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టినపుడు ముందు చెరువుగట్ల అభివృద్ధికి, గ్రామంలోని రైతుల పంటపొలాల మెరకకు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వంటి అవసరాలకు ఉపయోగించాల్సి ఉంది. వీటన్నింటిని పక్కన పెట్టి మట్టివిక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. యడ్లపాడు మండలంతో పాటు నియోజకవర్గంలోని నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల్లోని పలు చెరువులను ప్రమాదకర స్థాయిలో లోతుగా తవ్వకాలు చేశారు. భారీ వర్షాలు కురిసి పూర్తిస్థాయిలో నీరుచేరితే ఈసారి ఇంకెన్ని కుటుంబాలకు ఇలా శాపంగా మారుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై యడ్లపాడు ఎంపీడీవో సీహెచ్‌ సువార్తను వివరణ కోరగా సీతమ్మ చెరువులో గత రెండేళ్లుగా నీరు–చెట్టు పథకం ద్వారా రెండుసార్లు తవ్వకాలు చే సినట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు