పరకాలలో ఉద్రిక్తత

23 Jul, 2017 12:58 IST|Sakshi
పరకాలలో ఉద్రిక్తత
► జిల్లా కేంద్రం ఏర్పాటుపై బంద్‌కు అఖిలపక్షం పిలుపు 
► రోడ్లపైకి చేరిన అన్ని వర్గాల ప్రజలు 
► ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన పట్టణం
► నాయకుల అరెస్ట్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు
► లాఠీ ఝుళిపించి చెదరగొట్టిన పోలీసులు
 
పరకాల: పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం శనివారం ఇచ్చిన బందు పిలుపు ఉద్రిక్తంగా మారింది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందగా బందులో పాల్గొనగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, మహిళలు రోడ్లపైకి చేరి  ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పాలకుల వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. యువకులు రోడ్లపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. దీంతో పట్టణంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ స్తంభించింది.

రంగంలోకి దిగిన పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నాయకులను తీసుకెళ్లకుండా జీపులకు మహిళలతో యువకులు అడ్డుతగలటంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. వాహనాలవైపు ఆందోళనకారులు దూసుకురావడంతో పోలీసులు రోడ్లపై జనం ఉండకూడదంటూ హెచ్చరిస్తూనే లాఠీలకు పనిచెప్పారు. అఖిలపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకారులు గొడవకు దిగారు. పరకాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతుంటే ఏందుకు అడ్డుకుంటున్నారని వాగ్వాదం చేశారు. 
 
నాయకుల అరెస్ట్‌.. విడుదల
చివరకు ఆందోళనలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, చాడ రవీందర్‌రెడ్డి, పసుల రమేష్, పిట్ట వీరస్వామి, సారయ్య, దుప్పటి సాంబయ్య, నక్క చిరంజీవి, కక్కు రాజు, యాట నరేష్, శ్రీకాంత్, బొచ్చు భాస్కర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్టేషన్‌ ఎదుట ఆందోళకారులు నిరసన తెలపడానికి ప్రయత్నించగా నాయకులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. 
 
న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు
పరకాలకు న్యాయం జరిగే వరు తమ పోరాటం ఆగదని అఖిలపక్ష నాయకులు డాక్టర్‌ సిరంగి సంతోష్‌కుమార్, కొలుగూరి రాజేశ్వర్‌రావు, పసుల రమేష్, నక్క చిరంజీవి, బొచ్చు భాస్కర్‌ స్పష్టం చేశారు.పోరాటల గడ్డ పరకాలకు పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్‌తో పోరాడుతుంటే పోలీసులు లాఠీచార్జ్‌తో పాటు అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. మొగిలిచర్లలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడాన్ని  ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, పరకాలలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  
>
మరిన్ని వార్తలు