సీఆర్‌డీఏ దూకుడుకు హైకోర్టు బ్రేక్‌

15 Sep, 2016 23:36 IST|Sakshi
సీఆర్‌డీఏ దూకుడుకు హైకోర్టు బ్రేక్‌
 
పెనమలూరు : మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో సీఆర్‌డీఏ దూకుడుకు హైకోర్టు బ్రేకులు వేసింది. పెనమలూరు మండలంలో అక్రమ నిర్మాణాలపై సీఆర్డీఏ కొరడా ఝుళిపించడంతో బిల్డర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీఆర్‌డీఏ అధికారులు, బిల్డర్లకు మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. పెనమలూరు మండలంలో కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు, కొందరు బిల్డర్లకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో వివాదం నెలకొందని, ఈ క్రమంలోనే భవనాలను కూల్చివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్‌ హౌస్‌లు అక్రమంగా నిర్మించడంపై సీఆర్‌డీఏ అధికారులు వారం రోజులుగా దాడులు చేస్తున్నారు. మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ వద్దకు ఈ పంచాయితీ వెళ్లింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇ్పటివరకు దాదాపు 20 అక్రమ కట్టడాల శ్లాబ్‌లకు రంథ్రాలు పెట్టారు. దీంతో యనమలకుదురు, కానూరు గ్రామాలకు చెందిన బిల్డర్లు మూడు, నాలుగు రోజులుగా హైకోర్టుకు వెళ్తున్నారు. తమకు ఇచ్చిన నోటీసులకు అప్పీలుకు సీఆర్‌డీఏ అవకాశం ఇవ్వటం లేదని తెలిపారు. దీంతో సుమారు 25 మంది బిల్డర్ల భవనాల కూల్చివేతపై కోర్టు స్టే ఇచ్చింది. మరో పది మంది బిల్డర్ల పిటిషన్లు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కానూరులో ఒక అక్రమ కట్టడం మాత్రమే కూల్చివేశారు. త్వరలోనే మరింత మంది బిల్డర్లు స్టే తెచ్చుకునే అవకాశం ఉందని, ఈలోపు కూల్చివేత ప్రక్రియను ముగించాలని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. 
 
మరిన్ని వార్తలు