రేవంత్‌ ‘పిల్‌’పై స్పందించిన హైకోర్టు

28 Dec, 2016 02:39 IST|Sakshi

నకిలీ విత్తనాలపై వ్యాజ్యం విచారణకు స్వీకరణ
సాక్షి, హైదరాబాద్‌: నకిలీ విత్తనాల వినియోగం వల్ల కలిగిన నష్టాన్ని సదరు విత్తన కంపెనీల నుంచి వసూలు చేసి రైతులకు అందచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర హైబ్రిడ్‌ సీడ్స్, కావేరీ సీడ్స్, గంగా కావేరీ సీడ్స్, అంకూర్‌ సీడ్స్, రాశీ సీడ్స్, మోన్‌శాంటో, శ్రీరామ్‌ బయోసీడ్స్, నూజివీడు సీడ్స్, జె.కె.అగ్రి జెనెటిక్స్‌ విత్తన కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి శంకర నారాయణల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్న కంపెనీల స్థిర, చరాస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద విక్రయించి, ఆ మొత్తాలను రైతులకు పరిహారంగా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం, విత్తన కంపెనీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని రేవంత్‌ను ఆదేశించింది. పలు విత్తన కంపెనీలను ఆయన ప్రతివాదులుగా చేర్చడంతో వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని తెలిపిన ధర్మాసనం.. ప్రభుత్వానికి, విత్తన కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు