మేయర్‌కు షాక్‌

18 Sep, 2016 01:36 IST|Sakshi
మేయర్‌కు షాక్‌
 
  • తనకు తెలియకుండా టెండర్లు పిలవకూడదు
  • అధికారులకు మేయర్‌ అజీజ్‌ లిఖితపూర్వక ఉత్తర్వులు
  • మేయర్‌ ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ 
  • మేయర్‌ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు 
 
నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ అజీజ్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. కార్పొరేషన్‌లో పట్టు సాధించేందుకు మేయర్‌ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించగా శనివారం స్టే విధించినట్లు తెలిసింది. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంపై పట్టు సాధించేందుకు అధికార పార్టీలోని రెండు వర్గాలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ కట్టడాలపై కన్నెర చేశారు. ఈ క్రమంలో అక్రమ కట్టడాలకు సహకరించార ఆరోపణలతో ఏడుగురు అధికారులను సస్పెండ్‌ చేశారు. అయితే మేయర్‌ అజీజ్‌ తనకు తెలియకుండా నెల్లూరు కార్పొరేషన్‌లో మంత్రి జోక్యం చేసుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మేయర్‌ అజీజ్‌ ‘అర్జెంట్‌ ఆఫీస్‌ నోట్‌’ను తయారు చేయించాడు. తనకు తెలియకుండా ఏ పనులు చేయరాదని కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల అధికారులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేయర్‌ తీరుపై కార్పొరేషన్‌ అ«ధికారులు మండిపడ్డారు. 
మేయర్, మంత్రుల మధ్య నలుగుతున్న అధికారులు
ఓ వైపు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, మరోవైపు నగర మేయర్‌ అజీజ్‌ కార్పొరేషన్‌పై తమ పట్టు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్‌పై పట్టు కోసం మంత్రి నారాయణ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు.  కార్పొరేషన్‌ అధికారులకు తాను చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గ్రహించిన మేయర్‌ అజీజ్‌ తాను ఏమీ తక్కువ కాదంటూ తనకు తెలియకుండా ఏ పని చేయరాదని లిఖిత పూర్వకంగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరో వైపు కార్పొరేషన్‌లో పట్టు కోసం మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాందరెడ్డి తనదైన శైలిలో  పావులు కదుపుతున్నారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులు ఇరువర్గాల అంతర్గతపోరులో నలిగిపోతున్నారు. ఇప్పటికే ఓ ఉన్నతాధికారి అధికార పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ 
మేయర్‌ అధికారులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయడంపై  నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేషన్‌ విప్‌ బొబ్బల శ్రీనివాసులుయాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. శనివారం హైకోర్టు మేయర్‌ ఉత్తర్వులుపై స్టే విధించినట్లు సమాచారం. దేశంలోని ఏ కార్పొరేషన్‌లోనూ మేయర్‌ ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసిన దాఖలాలు లేవు. తనకు తెలియకుండా ఏ పని చేయకూడదని లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమమని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మేయర్‌ తీరును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండడం విశేషం.
మరిన్ని వార్తలు