బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద హైడ్రామా

27 Jul, 2016 18:20 IST|Sakshi

ఈ నెల 24న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనకు సంబంధించి బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఈ కేసులో ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు, కార్యదర్శి బి.రాజశేఖర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు 24 గంటల్లోపు విచారణకు తమ ముందు హాజరుకావాలని మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేశారు.

 

దీని ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల్లోపు వీరిద్దరూ బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే కే.ఎస్.రామారావు, రాజశేఖర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో హాజరవుతున్నారని ప్రచారం జరగడంతో మీడియా లైవ్ వాహనాలతో ఇక్కడవాలింది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా రామారావు, రాజశేఖర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌కు రాలేదు. దీంతో తదుపరి చర్యలు ఏంటన్నదానిపై పోలీసులు ఆలోచనలోపడ్డారు. మళ్లీ 41(ఏ) కింద రెండో నోటీసు జారీ చేయాలా లేకపోతే డెరైక్ట్‌గా అరెస్ట్ చేయాలా అన్నదానిపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇదిలా ఉండగా వీరిద్దరి ఫోన్లు రెండు రోజుల నుంచి స్విచ్ఛాఫ్ ఉండటంతో పాటు పోలీసులకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నోటీసులను ఇళ్లముందు అంటించి వచ్చారు. ఇంకోవైపు చిరంజీవితో పది సినిమాలు తీసిన తాను స్టేషన్‌కు వచ్చి అరెస్టు అయితే తన ఇజ్జత్ ఏం నిలుస్తుందని కే.ఎస్.రామారావు తన్న సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు