లోవకు భక్తజన వెల్లువ

16 Jul, 2017 22:41 IST|Sakshi
లోవకు భక్తజన వెల్లువ
తలుపులమ్మను దర్శించుకున్న లక్ష మంది
 గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్‌
తునిరూరల్‌ : జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాస మూడో ఆదివారం కావడం.. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.  తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక వాహనాల్లో భక్తులు వస్తూనే ఉన్నారు. లక్ష మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్‌ కమిషనర్, ఈఓ ఎస్‌. చంద్రశేఖర్‌ తెలిపారు. అమ్మవారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటలు భక్తులు క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చింది. పులిహోర ప్రసాదం మధ్యాహ్నం 12.30 గంటలకే నిండుకుంది. వివిధ విభాగాలు ద్వారా దేవస్థానానికి రూ.6,70,282 ఆదాయం లభించినిట్టు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. 
భక్తులకు అవస్థలు 
భారీగా తరలివచ్చి భక్తులకు వసతి గదులు లభించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఒక మోస్తరు వర్షం కురుస్తుండడంతో భక్తులు చిత్తడితో అవస్థలు పడ్డారు. దేవస్థానం అధీనంలో ఉన్న 125 కాటేజీలు, పొంగలి షెడ్లను భక్తులకు ఇచ్చారు. అవి లభించని వారు చెట్లను, కొండ దిగువన ఉన్న మామిడి, జీడి మామిడి తోటలను, ప్రైవేట్‌ పాకలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ప్రైవేట్‌ పాకల యజమానులు రూ.800  - రూ.1200 వరకు అద్దెలను డిమాండ్‌ చేశారు. కొంతమంది తమ వాహనాల్లోనే వంటలు, భోజనాలు చేశారు.  
స్తంభించిన ట్రాఫిక్‌ 
 పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, బస్సులు, కార్లు, ఇతర భారీవాహనాలపై భక్తులు లోవ దేవస్థానానికి భక్తులు చేరుకున్నారు. లోవ కొత్తూరు ఎర్రచెరువు వద్ద కల్వర్టు నిర్మాణంలో ఉండడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదు. రూరల్‌ సీఐ జి.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో తుని రూరల్, కోటనందూరు ఎస్సైలు సుధాకర్, శంకరరావు, 80 మంది పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు.  
బెల్టు షాపుల హవా 
లోవదేవస్థానంలో తలుపులమ్మతల్లిని దర్శించేందుకు భారీ సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో మందుబాబులతో మద్యం దుకాణం కిక్కిరిసిపోయింది. మందుబాబులు మంచి జోష్‌మీద ఉండడంతో బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. టోల్‌గేటు  వద్ద నుంచి ఘాట్‌ రోడ్డు వరకు 40 నుంచి 50 బెల్టు షాపులు వెలసినట్టు అంచనా. అయినప్పటికీ ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోలేదు. 
మరిన్ని వార్తలు