అగ్గి భగ్గు

9 Apr, 2017 14:37 IST|Sakshi
అగ్గి భగ్గు

= సండే, మండే ఎండే
= నేడు, రేపు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు
= ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దు
= వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన
= అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
= పాఠశాలల వేళలు సైతం కుదింపు


ఒంగోలు టౌన్‌/కారంచేడు: ప్రచండ భానుడు భగభగమంటున్నాడు. ఏప్రిల్‌ మాసంలోనే తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పుడే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్న ప్రజలకు వాతావరణ నిపుణుల హెచ్చరికలు మరింత హడలెత్తిస్తున్నాయి. రానున్న రెండురోజులు ఆది, సోమవారాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది.

ప్రజల్ని అప్రమత్తం చేయాలి :డీఆర్వో : రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యలో ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలు జిల్లాకు వచ్చాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరూ బయట తిరగరాదన్నారు. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో మైకులు, దండోరాలతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో పశువులను కూడా బయటకు వదలరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలలను ఉదయం 10 గంటలకే మూసివేయాలన్నారు. ఉపాధి కూలీలు ఉదయం 10గంటలకే పనులు ముగించుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ ఉదయం 9గంటలకే పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్‌ కమిషనర్లు అవసరమైన మేరకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో సీపీఓ భరత్‌కుమార్, డీఎంహెచ్‌ఓ యాస్మిన్, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ మురళి, డ్వామా పీడీ పోలప్ప, డీపీఓ ప్రసాద్, పశుసంవర్థకశాఖ జేడీ రజనీకుమారి పాల్గొన్నారు.

పాఠశాలల వేళలు కుదింపు..: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలని అధికారులు సూచించారు.

జిల్లాలో శనివారం 25 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శనివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు

పెద్దారవీడు    – 42.78                     మార్కాపురం    – 42.53                మర్రిపూడి    – 42.36,
పొదిలి    – 42.10,                           వెలిగండ్ల     – 41.79,                       రాచర్ల     – 41.55,
ముండ్లమూరు    – 41.51,              బల్లికురవ    – 41.24,                       సీఎస్‌పురం    – 41.15,
అద్దంకి    – 40.48,                         అర్ధవీడు    – 40.30,                          దొనకొండ    – 40.39,
దోర్నాల    – 40.87,                       గుడ్లూరు    – 40.58,                         హనుమంతునిపాడు–40.66,
కనిగిరి    – 40.92,                         కొమరోలు    – 40.89,                        కొనకనమిట్ల    –40.54,
కొండపి    – 40.58,                         పామూరు    – 40.83,                       పొన్నలూరు    – 40.06,
సంతనూతలపాడు– 41.0,               తర్లుపాడు    – 40.62,                        తాళ్లూరు    – 40.87,
త్రిపురాంతకం    – 40.26

మరిన్ని వార్తలు