ఒంగోలు జడ్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

18 Sep, 2015 13:26 IST|Sakshi

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలు  జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఈదర హరిబాబు సుప్రీంకోర్టు తీర్పు కాపీని తీసుకుని ఈ రోజు ఉదయం జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ విషయం గ్రహించిన జడ్పీ సీఈవో జిల్లా పరిషత్ కార్యాలయానికి తాళం వెళ్లి వెళ్లిపోయారు. దాంతో ఈదర హరిబాబు వర్గీయులు ఆగ్రహించారు. జడ్పీ కార్యాలయం ఎదుట హరిబాబుతోపాటు ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది.

తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రకాశం జెడ్పీ చైర్మన్ బాధ్యతలను వైస్ చైర్మనే నిర్వర్తిస్తారంటూ గత నెలలో ఏపీ హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రోహిన్‌టన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
దీంతో జడ్పీ చైర్మన్‌గా ఈదర హరిబాబు కొనసాగేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. తెలుగుదేశం పార్టీ విప్ ఉల్లంఘించారంటూ పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై, జెడ్పీ చైర్మన్‌గా ఉన్న ఈదర హరిబాబుపై జిల్లా కలెక్టర్ విజయకుమార్ గతంలో అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఈదర హరిబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు