పూడిక మట్టికి రేటు

17 May, 2016 09:18 IST|Sakshi

 ఒక్కో లారీకి రూ.4300
 ప్రతీ రోజు వందల కొద్దీ ట్రిప్పులు
 ముడుపులతో అధికారుల కళ్లకు గంతలు
 
 సాక్షి, హన్మకొండ: చెరువుల నుంచి పూడిక తీసిన మట్టిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయూల్సి ఉండగా టన్నుకు వంద రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. నగర శివార్లలో మిషన్ కాకతీయ పథకం అమలవుతున్న చెరువులపై మట్టి వ్యాపారులు కన్నేశారు. ఎక్కువ పూడిక ఉందనే మిషతో మైనింగ్ సీనరేజ్ చెల్లించి ఇష్టారీతిగా పూడిక తీస్తున్నారు. మిషన్ కాకతీయ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టి కొడుతూ పూడిక మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నా రు. తక్కువ సమయంలో ఎక్కువ మట్టిని తరలించేందుకు ట్రాక్టర్లు, లారీలను కాదని భారీ టిప్పర్లను అద్దెకు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం 40 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పరుకు రూ.4,300 వసూలు చేస్తున్నారు. ఈ దందాకు సహకరించే అధికార యంత్రాంగానికి వాటా లు సమర్పించినా.. ప్రతీ టిప్పరుపై మట్టి వ్యాపారులకు రూ.1000 నుంచి 1500 వరకు లాభం వస్తున్నట్లు సమాచారం.
 
 అధిక లోడ్
 తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందేం దుకు పరిమితికి మించిన లోడుతో మట్టిని రవాణా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం   6 టైర్ల లారీలో 16 టన్నులు, 10 టైర్ల లారీలో 25 టన్నులు, 12 టైర్లకు 31 టన్నులకు మించి లోడ్ వేయరాదు. కానీ మిషన్ కాకతీయలో పూడిక మట్టిని తీసుకెళ్తున్న లారీలు అధిక లోడ్ తో వెళ్తున్నాయి. గీసుకొండ మండలం ఊకల్, శాయంపేట  చెరువుల వద్ద 12 టైర్ల లారీలు 30 తిరుగుతుండగా ఇందులో ప్రతీ ట్రిప్పుకు కనీసం 40 టన్నులకు తగ్గకుండా మట్టి లోడ్ చేస్తునారు. ఈ భారీ వాహనాలతో రోడ్లు త్వర గా పాడయ్యే ప్రమాదం ఉంది. గీసుకొండ మండలం ఊకల్లు చెరువు, వంచనగిరి శాయంపేట చెరువు, చెన్నారం, హన్మకొండ మండ లం నక్కలపల్లి, తిమ్మాపురం, మామునూరు చెరువుల నుంచి మట్టి ఇటుక బట్టీలకు నిరంతరం తరలిపోతోంది. మిషన్ మట్టితో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన విజి లెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు.. కళ్లేదుటే నిత్యం వందలాది లారీలు తిరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
 
 కేసులు నమోదు చేస్తాం
 గీసుకొండ మండలం ఊకల్ చెరువుతో మరి కొన్ని చెరువుల్లో పూడికతీతల పేరిట నిబంధనలకు విరుద్ధంగా రెండు నుంచి నాలుగు మీటర్ల వరకు మట్టితో పాటు మొరం తీయడంపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ బ్రాంచ్ ములుగు ఈఈ గోపాలరావు స్పందించారు. పూడికతీతలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని సంబంధిత డీఈఈకి ఆదేశాలు జారీ చేశామని, మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లో నిబంధలనకు విరుద్ధంగా పూడిక మట్టి తీస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ చెరువులో పూడిక  మట్టి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, మట్టిని ప్రైవేటు వ్యక్తులు వారి అవసరాలకు తీసుకుపోయేందుకు మైనింగ్ శాఖకు సీనరేజీ చెల్లించారని తెలిపారు. నిర్దేశించిన క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకుపోయేందుకు తాము అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు