కొండ మండుతోంది

14 Apr, 2017 01:41 IST|Sakshi
కొండ మండుతోంది

తిరుమలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
శేషాచల ఏడుకొండల్లోనూ     వడగాల్పులు, ఉక్కపోత
శ్రీవారి భక్తుల అవస్థలు
ఈసారి ఉపశమన చర్యలు   పెంచిన టీటీడీ


సూర్యభగవానుడు భగభగమంటున్నాడు. చల్లగా  ఉండే శేషాచల ఏడుకొండల్ని కూడా వదలకుండా నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో తిరుమలలో గురువారం అత్యధికంగా 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాల్పులు, ఉక్కపోత పెరగడంతో భక్తులు అల్లాడుతున్నారు. టీటీడీ కూడా ఈసారి ఉపశమన చర్యలు రెట్టింపు చేసింది.

తిరుమల:
ఈ వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో సూర్యభగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.  తిరుమల ఏడుకొండల మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. వేసవి సీజన్‌లోనూ చల్లగా ఉండే తిరుమలకొండ మీద ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం 33.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చల్లని ఈదురు గాలులకు బదులు వడగాల్పులు వీస్తున్నాయి.

శ్రీవారి భక్తులకు ఉక్కపోత
ఈ సీజన్‌లో గతంలో కంటే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులు ఎండలోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఆలయానికి వెళ్లిన భక్తులు ఎండలో నడిచేందుకు అష్టకష్టాలు చవిచూస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తరాదికి చెందిన భక్తుల పరిస్థితి వర్ణనాతీతం.

ఉపశమన చర్యలు రెట్టింపు
వేసవిలో భక్తుల ఇబ్బందులకు తగ్గట్టుగానే ఈసారి టీటీడీ ఉపశమన చర్యలు పెంచింది. ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వేసవి ఏర్పాట్లు పెంచాలని ఆదేశించారు. ఫలితంగా ఫిబ్రవరి నుంచే వేసవి ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లోనూ భక్తులకు కాళ్లు కాలకుండా చలువ సున్నం (కూల్‌ పెయింట్‌) వేసి ఎర్ర తివాచీలు పరిచారు. నాలుగు మాడ వీధుల్లో వాటర్‌ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేశారు. పగటి వేళల్లో నీటిని చల్లడం వల్ల నేల చల్లబడుతోంది. దీంతో భక్తులు కూడా సులభంగా నడిచి వెళుతున్నారు. ఆలయం వద్ద తాగునీటి ఏర్పాట్లు పెంచారు. ఆలయ ముందుభాగంలో, లడ్డూ కౌంటర్ల వద్ద చలువ పందిళ్లు నిర్మించారు. రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ అవసరమైన చోట చలువ పందిళ్లు వేశారు.

అధికారులూ వీటిపై దృష్టి సారించండి
పెరుగుతున్న ఎండలకు తగ్గట్టుగానే వేసవి ఏర్పాట్లపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా తూర్పుమాడ వీధి మినహాయించి మిగిలిన దక్షిణ, పడమర, ఉత్తర మాడ వీధుల్లోనూ చలువ పందిళ్లు నిర్మించడం వల్ల భక్తుల కొంత సమయం పాటు ఆగి వెళ్లేందుకు వీలు పడుతుంది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భక్తులకు ఈ ఎండ కష్టాలు తప్పుతాయి.రూ.300 టికెట్ల క్యూ, సర్వదర్శనం క్యూ, కాలిబాట క్యూకు ప్రతిసారీ మార్చిలోనే నిర్మించే వట్టివేరు చాపలు ఇంకా అమర్చలేదు. దీనిపై అధికారులు సత్వరమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆలయ మాడ వీధుల్లో తాగునీటితోపాటు మజ్జిగ పంపిణీ చేయడం వల్ల భక్తులకు టీటీడీ మరింత మేలు చేసినట్టువుతుంది. కాలిబాటల్లోనూ మంచినీటితోపాటు మజ్జిగ పంపిణీ చేయాలి. అవసరమైతే నడిచివచ్చే భక్తులకు గ్లూకోజ్, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉచితంగా ఇస్తే భక్తులు వడదెబ్బకు గురికాకుండా క్షేమంగా తిరుమలకొండెక్కే అవకాశం కలుగుతుంది.

మరిన్ని వార్తలు