హిందీ పండిట్‌ మునివరరాజు మృతి

24 Dec, 2016 23:33 IST|Sakshi

ప్రొద్దుటూరు కల్చరల్‌: ప్రొద్దుటూరు గాంధీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ హిందీ ఉపాధ్యాయుడు ఎన్‌.మునివరరాజు (92) శనివారం మధ్యాహ్నం వైఎంఆర్‌ కాలనీలోని తన స్వగృహంలో మృతి చెందారు. ఈయన 1925 మండలంలోని యరమలవారిపల్లెలో జన్మించారు. ఏర్పేడు వేదాశ్రమంలో విద్య అనంతరం దక్షిణభారత హిందీప్రచార సభలో హిందీభాషపై శిక్షణ పొందారు. 1949లో అనిబిసెంటు మున్సిపల్‌ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడిగా చేరి 1984 వరకు 35 ఏళ్లపాటు విద్యాబోధన చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేశారు. వైఎంఆర్‌ కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేశారు. తన సొంత ఖర్చులతో విద్యామందిరంలో గదిని నిర్మించారు. నీరు, పర్యావరణ పరిరక్షణ కోసం అనేక మొక్కలను పెంచి అందరికి ఆదర్శంగా నిలిచి వృక్షపోషక బిరుదు పొందారు. ఈయన శిష్యుల్లో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఎంవి.రమణారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలతోపాటు ఎందరో ఐపీఎస్, ఐఏఎస్‌లుగా ఉండి దేశ సేవ చేస్తున్నారు. ఈయన హిందీ, తెలుగు, సంస్కృత, ఆంగ్లభాషాల్లో ప్రావిణ్యం పొంది రచనలు చేశారు. గాంధీ వద్ద కొంత కాలం వాలెంటీర్‌గా పనిచేసిన మునివరరాజు ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈయన మృతి పట్ల పుట్టపర్తి సాహితీపఠం కార్యదర్శి జింకా సుబ్రమణ్యం, ఉపాధ్యాయులు నరసింహులుతోపాటు పలువురు సంతాపం తెలిపారు. ఆదివారం ఉదయం మునివరరాజు మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.


 

మరిన్ని వార్తలు