స్వాతంత్య్ర సమర దృశ్య సదనం కూల్చివేత

3 Aug, 2016 01:08 IST|Sakshi
స్వాతంత్య్ర సమర దృశ్య సదనం కూల్చివేత
 
సాక్షి, విజయవాడ :
కృష్ణానదీ తీరంలోని దేవాలయాలను, విగ్రహాలనే కాదు... స్వాతంత్య్ర సమర సంగ్రామం నాటి గుర్తులను కూడా జిల్లా అధికారులు తుడిచేస్తున్నారు. ఘాట్ల నిర్మాణం పేరుతో నదీతీరంలో ఉన్న స్వాతంత్య్ర సమర దృశ్య సదనాన్ని మంగళవారం నేలమట్టం చేశారు. ఈ ఘటన పలువురు స్వాతంత్య్ర సమరయోధుల్ని కలిచివేస్తోంది. విజయవాడ తొలి మేయర్‌ టి.వెంకటేశ్వరరావు, పూర్వ కమిషనర్‌ గుల్జార్‌లు భావి పౌరులకు  స్వాతంత్య్రోద్యమం గురించి తెలిపేలా  కృష్ణాతీరాన 2006లో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో స్వాతంత్య్రోద్యమ నాటి ఘట్టాలు కళ్లకు కట్టినట్లు చూపే పెయింటింగ్స్‌ ఉంచారు. ఈ చిత్రాల్లో మహాత్మాగాంధీ, జవహార్‌లాల్‌ నెహ్రూ, భగత్‌సింగ్, సుభాస్‌ చంద్రబోస్, సర్దార్‌ పటేల్‌ వంటి అనేక మంది ప్రముఖులు అప్పట్లో పాల్గొన్న ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. 2007 ఆగస్టు 15న  దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నగరానికి వచ్చిన వారంతా ఈ భవనాన్ని సందర్శించేవారు. పుష్కరాల ఆ నేపథ్యంలో అధికారులు ఈ భవనాన్ని కూల్చివేశారు. దీనిపక్కనే ఉన్న శ్రీ కృష్ణదేవరాయ విగ్రహాన్ని మాత్రం యథావిధిగా ఉంచారు. 
భవనం కూల్చివేయడం చాలా ఘోరం : టీవీ, చిత్రకారులు
స్వాతంత్య్రోద్యమం నాటి ఘట్టాలను వివరిస్తూ వేసిన మేం వేసిన పెయింటింగ్‌లు ఉంచిన భవనాన్ని కూల్చివేయడం చాలా ఘోరం. ప్రతి రోజు రాత్రిపూట స్వాతంత్రోద్యమం నాటి చరిత్ర పుస్తకాలను క్షుణ్ణంగా చదువుకుని  తెల్లవారిన తరువాత పెయింటింగ్‌ వేసేవాళ్లం. అప్పట్లో నెహ్రూ, గాంధీ వంటి వారు ఏ విధంగా ఉండేవారో ఊహించుకుని, అప్పట్లో అందుబాటులో ఉన్న కొన్ని చిత్రాలను పరిశీలించి ఈ పెయింటింగ్స్‌ వేశాం.  ఆదాయం కంటే భావితరాలకు స్వాతంత్య్రం గురించి తెలియాలనే తపనతోనే ఈ చిత్రాలను  వేశాం. అందులో చిత్రాలను ప్రస్తుతం  ఎక్కడ పెట్టారో కూడా చెప్పలేదు. కూల్చివేస్తున్న విషయం మాకు తెలియదు. 
 
మరిన్ని వార్తలు