మహిళకు హెచ్‌ఐవీ పరీక్ష

29 Jul, 2016 00:34 IST|Sakshi
– పెబ్బేరులో అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్వాకం 
– విరేచనాలయ్యాయని వస్తే ఇలా చేశారని మహిళ ఆవేదన 
– పీహెచ్‌సీ వైద్యాధికారికి ఫిర్యాదు 
తోమాలపల్లి(పెబ్బేరు) : విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళకు హెచ్‌ఐవీ పరీక్ష చేసిన సంఘటన పెబ్బేరు పీహెచ్‌సీలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పీహెచ్‌సీ వైద్యాధికారి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని తోమాలపల్లికి చెందిన దళితమహిళ, భర్త వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తోంది. విరేచనాలు అవుతుండడంతో ఈనెల 12న వైద్యం కోసం పెబ్బేరు పీహెచ్‌సీకి వచ్చింది. ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో వేచి ఉండగా, తోమాలపల్లికి చెందిన ముస్తాఫా(108 అంబులెన్స్‌ డ్రైవర్‌) కనిపించాడు. అతనికి తన పరిస్థితిని వివరించి సాయం కోరింది. దీంతో ముస్తాఫా ఆమెను ఆస్పత్రిలోని ల్యాబ్‌లోకి తీసుకెళ్లి, హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయాల్సిందిగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ వెంకటేష్‌కు సూచించాడు. ఆస్పత్రి ఆవరణలోనే 108సిబ్బంది నివాసం ఉండడం వల్ల ముస్తాఫా పరిచయం ఉండడంతో ల్యాబ్‌ టెక్నీషియన్‌ వెంకటేష్‌ ఎలాంటి ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే ఆమె రక్తాన్ని తీసుకొని హెచ్‌ఐవీ పరీక్ష చేశాడు. కాసేపటి తర్వాత పరీక్ష చేసిన కిట్‌ను మహిళకు ఇవ్వడంతో ఆమె దానిని తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత మరోసారి పెబ్బేరులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చినప్పుడు గతంలో చేసిన వైద్యం గురించి డాక్టర్లు అడిగారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేసిన పరీక్ష కిట్‌ను చూయించింది. దీంతోవారు విరేచనాల కోసం రక్తపరీక్ష అవసరం ఉండదని చెప్పారు. ప్రత్యేకించి హెచ్‌ఐవీ పరీక్ష చేయించారని చెప్పడంతో ఆమె విస్తుపోయింది. ఈనెల 26న తన కుటుంబసభ్యులతో పెబ్బేరు పీహెచ్‌సీకి చేరుకుని వైద్యాధికారి అనుపమ జేమ్స్‌కు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా ఈపరీక్షలు చేసిన ముస్తాఫాపై, ల్యాబ్‌టెక్నీషియన్‌ వెంకటేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆగ్రహంతో ఉన్న బాధితురాలి బంధువులు అక్కడే ఉన్న ముస్తాఫాకు దేహశుద్ధి చేశారు. 
 
ముస్తాఫా చెబితేనే పరీక్ష చేశా 
– వెంకటేష్, ల్యాబ్‌ టెక్నీషియన్, పెబ్బేరు 
108 డ్రైవర్‌ ముస్తాఫా ఆమెను తీసుకువచ్చి తమ గ్రామానికి చెందిన మహిళ అని చెప్పి హెచ్‌ఐవీ పరీక్ష చేయమన్నాడు. ఎంతోకాలంగా ఆస్పత్రిలో ఉంటూ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండడంతో వెంటనే పరీక్ష చేశాను. తర్వాత ఈ విషయం తెలిసింది. ఇప్పుడు తనకేం తెలియదని బుకాయిస్తున్నాడు. 
 
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం 
– డాక్టర్‌ సౌజన్యలత, వైద్యాధికారి, పెబ్బేరు 
వైద్యులు సూచించకుండానే మహిళకు హెచ్‌ఐవీ పరీక్ష చేసిన విషయం నాకు తెలిసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును వనపర్తి ఎస్పీహెచ్‌ఓ శ్రీనువాసులు దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం. వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాం.  
మరిన్ని వార్తలు