హోదా సంజీవనే..

22 Sep, 2016 00:01 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు :  ప్రత్యేక హోదా ఖచ్చితంగా సంజీవినే.. ఇది ప్రతి నిరుద్యోగి చెబుతున్న మాట.. ఎందుకంటే వ్యవసాయిక జిల్లా అయిన పశ్చిమ గోదావరిలో పారిశ్రామిక రంగంలో మాత్రం రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించక పోగా వాటికి ఇచ్చే నిధుల్లో కూడా కోత పెట్టారు. దీంతో గడిచిన రెండేళ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఉపాధి కల్పన శాఖ కూడా ప్రైవేటు కంపెనీలలో మార్కెటింగ్‌ ఉద్యోగాలను మాత్రమే కల్పించింది. ఇక్కడ కూడా వేతనాలు లేక 90 శాతం మంది మళ్లీ ఆ ఉద్యోగాలను మానివేశారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉపాధి కార్యాలయంలో నమోదు చేయించుకున్న వారి లెక్కన చూస్తే 81,561 మంది నిరుద్యోగులు ఉంటే, అనధికారికంగా నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వనరులు ఎక్కువగా ఉన్నా వాటిని వినియోగించుకునే పరిశ్రమలే లేవు. 
అభివృద్ధికి జిల్లాలో ఎంతో అవకాశం 
పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. 29 డెల్టాతో పాటు 19 మెట్ట మండలాల్లో మెజారిటీ వరి పంట పండిస్తారు. వరి ద్వారా రైస్‌ మిల్లులను ఎక్కువగా పెంపుదల చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఒక్క తాడేపల్లిగూడెం ఏరియాలోనే 40 వరకూ రైస్‌మిల్లులు మూత పడ్డాయి. మనకు సుద్ద నిల్వలు అపారంగా ఉన్నాయి. దీని ద్వారా సిరామిక్‌ పరిశ్రమలను స్థాపించవచ్చు. బొగ్గు నిల్వలు చింతలపూడి ప్రాంతంలో లభిస్తున్నాయని తేలింది. కనీసం దీనిపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి కేంద్రీకరించలేదు. జిల్లాలో పండించే చెరకు వల్ల పంచదార పరిశ్రమలను అధికంగా ఏర్పాటు చేయవచ్చు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే చాగల్లు సుగర్‌ ఫ్యాక్టరీ దివాలా తీసే స్థాయికి చేరింది. జీడిమామిడి ఉత్పత్తులు, ఆక్వా రంగంపైనా దృష్టి కేంద్రీకరించి ఫీడ్‌ యూనిట్లు వంటివి నెలకొల్పవచ్చు. జూట్‌ నగరంగా పేరుగాంచిన ఏలూరులో జూట్‌ మిల్లులపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. 12 వేల మందికి ఉపాధి కల్పించే ఏలూరు జూట్‌ మిల్లులు ప్రస్తుతం కేవలం 6 వేల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. 
హోదా వచ్చి ఉంటే.. 
జిల్లాలో రూ.7,400 కోట్ల వ్యయంతో 5 మెగా ప్రాజెక్టుల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వాటి ద్వారా 12,820 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటూ మాటలు చెప్పారు. అయితే వాటిలో ఏ ఒక్కటి నేటికీ పూర్తి కాలేదు. జిల్లాలో లభించే ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పితే మరో లక్షా యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు పారిశ్రామిక రంగంలో కల్పించవచ్చు. రెండు సంవత్సరాలలో వివిధ రాయితీల రూపంలో ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు 50 కోట్ల రూపాయలు సబ్సిడీ నిధులు విడుదల చేసింది. ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీ నిధులు మరో రూ.100 కోట్లకు పైబడి జిల్లాకు విడుదలయ్యే అవకాశం ఉండేది. రెండేళ్లలో జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 798 మంది స్థాపించేందుకు ముందుకు వచ్చారు. వాటిలో 772 మందికి అనుమతులు ఇవ్వగా, ఇందులో పదోవంతు పరిశ్రమలు కూడా ఏర్పాటు కాలేదు. ఇవన్నీ అనుమతుల దశలోనే నిలిచిపోయాయి. అదే హోదా వచ్చినట్టయితే ఈ పరిశ్రమలన్నీ ఆచరణలోకి వచ్చి ఉండేవి. హోదా లభిస్తే పరిశ్రమలకు కస్టమ్స్, ఎకై్సజ్‌ సుంకాలలోనూ, కార్పొరేట్‌ ఇ¯Œæకమ్‌ ట్యాక్స్‌లో పూర్తి మినహాయింపు లభిస్తుంది. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్‌ కేపిటల్‌పై 3 శాతం వడ్డీ రాయితీ, 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్‌ చార్జీలపై 50 శాతం రాయితీ వంటి సౌకర్యాలు లభిస్తాయి. హోదావల్ల ఇటువంటి సౌకర్యాలు అందుతాయి కనుక పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పోటీ పడేవారు. 
కేటాయింపులు ఘనం.. అమలు శూన్యం
జిల్లాలో మచ్చుకైనా భారీ పరిశ్రమలు కనిపించడం లేదు. ప్రభుత్వం భారీ పరిశ్రమలు జిల్లాలో స్థాపిస్తామంటూ చెబుతోంది. కానీ ఆ విధమైన ప్రయత్నాలు చేసేందుకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. రెండేళ్లలో భారీ పరిశ్రమల కోసం రూ.200 కోట్లు కేటాయింపులు చేస్తే వాటిలో కేవలం రూ.122 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. 2015–16 విషయానికి వస్తే  805 కోట్ల రూపాయలు పరిశ్రమలకు వెచ్చించాలని నిర్దేశించుకున్నా వాటిలో కేవలం రూ.264.4 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా వస్తే పశ్చిమ గోదావరి చివరి స్థానం నుంచి ముందుకు వచ్చే అవకాశంతో పాటు వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
 
మరిన్ని వార్తలు