కేసీకెనాల్‌ సబ్‌ చానల్‌కు గండి

15 Jan, 2017 23:19 IST|Sakshi
కేసీకెనాల్‌ సబ్‌ చానల్‌కు గండి
– 157 ఎకరాల పంట నష్టం 
– అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న రైతులు
కానాల(నంద్యాలరూరల్‌): మండల పరిధిలోని కానాల గ్రామ సమీపంలోని  మిట్నాల మోరి  పొన్నాపురం సబ్‌ చానెల్‌ 11వ కి.మీ వద్ద ఆదివారం తెల్లవారుజామున గండి పడింది. సబ్‌చానెల్‌కు గండి పడటంతో సమీపంలోని మద్దెల చిన్న చెన్నప్ప, పెద్దచెన్నప్ప, గజ్జెల చిన్న హుసేని, గుర్రప్ప, బంక వెంకటరామిరెడ్డి, కిరణ్, నెరవాటి బాబు, డీసీ హుసేన్, కల్లూరు మాబువలి, అసన్, హుసేన్, తదితరులకు చెందిన సుమారు 157 ఎకరాల ఆవాలు, జొన్న, కంది పంటలు నీటి మునిగాయి. నీటి ప్రవాహ ఉద్ధృతికి కొని​‍్నచోట్ల  భూమి కోతకు గురైంది.
 
   రబీ పంటకు సాగునీరు అందదు.. ఆరుతడి పంటలు వేసుకోండి అని కేసీకెనాల్‌ అధికారులు చెప్పారు. వారు చెప్పినట్టు  తాము ఆరుతడి పంటలు వేసుకున్నామని, మరి ఉన్నట్టుండి సబ్‌చానెల్‌కు ఎక్కువ నీరు ఎందుకు వదిలారని రైతులు, అధికారులను నిలదీస్తున్నారు. అనధికారికంగీఆ కుందూనదికి నీటి ప్రవాహం పెంచి నెల్లూరుకు నీరు అందించేందుకే  ఇలా చేశారని ఆరోపించారు.  కేసీ కాల్వ గట్లు బలహీనంగా ఉన్నాయని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వాపోయారు. ప్రస్తుతం కాలువ గట్లు తెగి  పంటకు భారీ  నష్టం జరిగిందని, తమకు  పరిహారం చెల్లించాలని కానాల రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే సబ్‌చానల్‌కు నీటి విడుదలను ఆపేసి తాత్కాలికంగా గండిని పూడ్చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేసీ కెనాల్‌ ఏఈ చంద్రుడు వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు