గూడు..గోడు

14 Sep, 2017 00:04 IST|Sakshi
గూడు..గోడు
- గ్రామీణ గృహ నిర్మాణాల్లో నిర్లిప్తత
- టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకే గృహాలు
- వాటినీ పూర్తి చేయించని వైనం
- ఈ నెలాఖరులోపు లక్ష్యసాధన అసాధ్యం
- నిరుపేదలు పూరి గుడిసెల్లో మగ్గుతున్నా పట్టించుకోని యంత్రాగం
 
 ఆళ్లగడ్డ : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టాలంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! భూమి ధరలకు రెక్కలు తొడుగుతున్న వేళ.. భవన నిర్మాణ సామగ్రి, కూలి రేట్లు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పేదల సొంతింటి కల సాకారం కావడం కష్టసాధ్యంగా మారింది. అందుకే అందరూ ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్లుగా గృహ నిర్మాణ పథకం చతికిల పడింది. టీడీపి ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ పథకానికి పేరు మార్చి.. ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకంగా నామకరణం చేసింది. అలాగే పట్టణ ప్రజల కోసం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (అందరికీ ఇళ్లు) అమలు చేస్తున్నారు. 2016 –17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు 17,255 ‘ఎన్టీఆర్‌ గృహాలు’ మంజూరు చేశారు. వీటికి పూర్తి స్థాయిలో ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. పథకంపై లబ్ధిదారుల్లో అవగాహన లేకపోవడంతో పాటు గతంలో ఇళ్ల కోసం కేటాయించిన  ప్రభుత్వ స్థలాలకు పట్టాలు పొందిన వారి జాబితాలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణం గందరగోళంగా మారింది.
 
ఇప్పటివరకు 3,803 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 1,808 ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికీ మొదలుపెట్టలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 –18), వచ్చే ఏడాది (2018– 19)కి  కలిపి జిల్లాకు మొత్తం 28,600 ఇళ్లు మంజూరయ్యాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు అదనంగా మరో మూడు వేల గృహాలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 14,300 గృహాలు గత ఏడాది ఆగస్టులోనే మంజూరయ్యాయి. అయితే.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, జాబితాలు ఉన్నతాధికారులకు చేరేసరికి నెలలు పట్టింది. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల అనుయాయులకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. ‘అందరికీ ఇళ్లు’ పథకం దరఖాస్తులు పూరించడంలోనూ ప్రజలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  
 
గడువులోగా సాధ్యమేనా? 
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50 లక్షల చొప్పున అందిస్తోంది. మంజూరు చేసిన గృహాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇప్పటి వరకు 2017– 18 ఆర్థిక సంవత్సరానికి గాను 4,196 మంది, 2018 – 19కి గాను 1,123 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. వారు నిర్మాణాలు మొదలు పెట్టినట్లు రికార్డుల్లో నమోదైంది.  లక్ష్యసాధనకు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోపు మిగిలిన 23,281 గృహాలను పూర్తిచేయడం సాధ్యమయ్యే పని కాదు.
 
‘ధరా’ఘాతం
ప్రస్తుతం గృహ నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయి. నిబంధనల ప్రకారం కనిష్టంగా 200 చదరపు అడుగులు, గరిష్టంగా 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే గృహ నిర్మాణాలు చేపట్టాలి. అయితే..చాలామంది  లబ్ధిదారులు అంతకంటే ఎక్కువ స్థలంలోనే నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ప్రభత్వం అందిస్తున్న రూ.1.50 లక్షల కంటే ఎక్కువ వ్యయమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు పూర్తవ్వగానే నిర్మాణాలు నిలిపివేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. లేదంటే అప్పు చేసి కట్టుకోవాలి.
 
 
మూడు వేల గృహాలు ఏవీ?
మంత్రి అఖిలప్రియ వైఎస్సార్‌సీపీ నుంచి అధికార పార్టీలో చేరిన సమయంలో అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనంగా వెంటనే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మూడు వేల పక్కా గృహాలను ప్రత్యేకంగా మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.  ప్రభుత్వం నుంచి మంజూరు చేసినవాటికి తోడు అదనంగా మూడు వేల గృహాలు మంజూరైతే చాలామందికి ఇళ్లు దక్కుతాయని నిరుపేదలు ఆశపడ్డారు. అయితే..వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. అఖిలప్రియ పార్టీ మారి ఏడాది దాటినా, మంత్రి పదవి కూడా చేపట్టినా అదనంగా మంజూరు చేయిస్తానన్న మూడువేల ఇళ్ల మాట ఎత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. 
 
మరిన్ని వార్తలు