మూతపడిన హోమియో వైద్యశాల

2 May, 2017 17:25 IST|Sakshi
మూతపడిన హోమియో వైద్యశాల

బేస్తవారిపేట: ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. వైద్యశాలకు డాక్టర్‌ను, కాంపౌండర్, స్వీపర్‌ను కాని నియమించకపోవడంతో హోమియో వైద్యశాల నిరుపయోగంగా మారింది. మండలంలోని గలిజేరుగుళ్ల హోమియో వైద్యశాలకు డాక్టర్‌ లేకపోవడంతో మూతపడింది. మూడేళ్ల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ బదిలిపై వెళ్లారు. అప్పటి నుంచి వైద్యశాలకు డాక్టర్‌ను నియమించలేదు. కనీసం వైద్యశాలకు ఇన్‌ఛార్జీని ఎర్పాటు చేసేవిధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.

దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో మందులు బాగ పనిచేస్తుండటం, వ్యాధి నయమైన తర్వాత తిరిగి రాకపోవడంతో నిత్యం అధిక సంఖ్యలో రోగులు వైద్యశాలకు వస్తున్నారు. వైద్యశాల పరిధిలోని 18 గ్రామాల ప్రజలు హోమియో వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్థుతం వైద్యశాల మూతపడటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్‌ ఉన్నాడని వైద్యశాలకు వచ్చినవారు నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఏంతో విలువైన హోమియో మందులు వైద్యశాలలో ఉన్నప్పటికి ప్రజలకు అందకుండా పోతున్నాయి. హోమియో మందులు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండని కారణంగా ప్రజలు హోమియోపతి పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

జుట్టు, చర్మ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల వాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా థైరాయిడ్, పడకతడపడం, మధుమేహం, ఊబకాయం వంటి ఇతర రోగాలకు హోమియో మందులు బాగ పనిచేస్తాయి. జిల్లా అధికారులు చర్యలు తీసుకొని వైద్యశాలకు డాక్టర్‌ను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

జిల్లా అధికారులు చర్యలు తీసుకొని హోమియో వైద్యశాలకు డాక్టర్‌ను నియమించాలి. మూడేళ్లుగా డాక్టర్‌లేక వైద్యశాల మూతపడింది. నిత్యం ప్రజలు వైద్యశాలకు వచ్చి వెనుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ఎక్కువగా హోమియో మందులు వాడుతున్నారు. -రమణయ్య

వైద్యశాలలో విలువైన మందులు ఉన్నప్పటికి డాక్టర్‌ లేకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. హోమియో మందులు ఏటువంటి సైడ్‌ ఏఫెక్ట్‌లు ఉండని కారణంగా దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే వైద్యశాలకు డాక్టర్‌ను నియమించక పోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -నారాయణ

మరిన్ని వార్తలు