ఇదేం ‘సంక్షేమం’!

4 Jan, 2017 22:30 IST|Sakshi
ఇదేం ‘సంక్షేమం’!

వసతి గృహాలు..  సమస్యల నిలయాలు
కరువైన మౌలిక వసతులు
చలికి వణుకుతున్న విద్యార్థులు
పలుచని దుప్పట్లతో  తప్పని తిప్పలు
విడుదల కాని డైట్‌..  కాస్మోటిక్‌ చార్జీలు


జగిత్యాల : జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు..సమస్యలకు నిలయాలుగా మారాయి. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు... ఐదు నెలల నుంచి విడుదల కాని డైట్‌ బిల్లులతో హాస్టల్‌ వార్డెన్లు అవస్థలు పడుతున్నారు. హాస్టళ్లలో సమస్యల మధ్య బోధనసాగిస్తూ విద్యార్థులు.. వంట సామగ్రి కోసం రూ.లక్షల్లో అప్పులు చేస్తూ వార్డెన్లు కాలం వెళ్లదీస్తున్నారు. ఐదు నెలల నుంచి..కనీసం కాస్మోటిక్‌ ఛార్జీలు కూడా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహాల్లో 9, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు చెబుతున్న    ట్యూటర్లకు గతేడాది నుంచి వేతనాలు విడుదల కాలేదు. దీంతో ట్యూటర్లు మొక్కుబడిగా చదువులు చెబుతూ.. క్రమంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 40 హాస్టళ్లుండగా.. వాటిలో తొమ్మిది వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగడం గమనార్హం. దీంతో పాటు..హాస్టళ్లలో వైద్యాధికారులు విజిట్‌ చేయకపోవడంతో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తప్పడంలేదు. చలి, జ్వరాలతో బాధపడుతూ.. విద్యార్థులే బయటి నుంచి మందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ.. చదివే మూ డో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు డైట్‌ అలవెన్సు కింద ఒక్కొక్కరికి ప్రతి నెల రూ. 750లు ఇస్తుంది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ. 850, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థులకు రూ. 1050ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో పాటు ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రతి నెల రూ.62ల చొప్పున కాస్మోటిక్‌ ఛార్జీలు ఇస్తుంది. అందులో రూ.51 సబ్బు, ఇతర వస్తువుల కోసం, రూ.11 హెయిర్‌ కట్టింగ్‌ కోసం ఇస్తుంది. వి ద్యార్థినిలకు రూ.75లు ఇస్తుంది. ఇందులో సబ్బులు, పౌడర్, నూనె కోసం రూ.50లు, నాప్‌కిన్, ఇతర వస్తువుల కోసం రూ.25లు ఇస్తుంది. జిల్లాలోని అన్ని హాస్టళ్లకు ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తోంది. కూరగాయలు, నిత్యావసర వస్తువులన్నీ సంబంధింత వార్డెన్లే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. జిల్లాలో ఏహాస్టల్‌కు డైట్‌ అలవెన్సులు ఈ ఏడాది జూలై నుంచి విడుదల కాలేదు.

ఇప్పటి వరకు ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో చదివే ఒక్కోవిద్యార్ధికి సగటున రూ.800 చొప్పున లెక్కిస్తే.. నాలుగొందల మందికి కలిసి రూ.1.60 కోట్లు, వెయ్యి మంది పోస్ట్‌మెట్రిక్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1050 చొప్పున రూ.52.50 లక్షలు మొత్తం రూ.2.12 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో హాస్టల్‌ వార్డెన్లు బయట అప్పు చేసి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే.. కాస్మొటిక్‌ ఛార్జీల కింద నాలుగొందల మంది విద్యార్ధినీవిద్యార్థులకు సగటున రూ. 67 చొప్పున లెక్కిస్తే.. నాలుగు నెలల కాలంలో రూ. 10.72 లక్షలు బకాయి ఉంది. ఇది ఇలాఉంటే జిల్లాలో తొమ్మిది వసతి గృహాలు ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

చలికి వణుకుతూ
జిల్లాలోని అనేక హాస్టళ్లలో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. సాయంత్రమైతే చాలు కిటికీలకు లేని తలుపుల ద్వారా వీచే చల్లనిగాలుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఇబ్బందులుపడుతున్నారు. విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్నా.. ఇంకా పంపిణీ కాని దుప్పట్లు.. పలు చోట్ల పంపిణీ చేసిన పలుచని చెద్దర్లకు బదులు ఇంటి నుంచి తమ వెంట తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకుంటున్నారు. ఒకే దుప్పట్లో ఇద్దరేసి విద్యార్థులు జారుకుంటున్నారు. కనీస కార్పెట్లు కూడా కరువవడంతో చాపలు పర్చుకుని నిద్రిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆరుగంటల మొదలు.. ఉదయం 7 గంటల వరకు విద్యార్థులు హాస్టళ్లలో చలితో పోరాటం చేయడం నిత్యాకృత్యమైంది. ఈ కనీసం కిటికీలకు తలుపులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో బయటి నుంచి చలి నేరుగా విద్యార్థులు నిదించే గదుల్లోకి ప్రవేశిస్తోంది. ఉదాహరణకు.. మల్లాపూర్‌ మండల కేంద్రంలో.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న గిరిజన మినీ గురుకులంలో చదివే విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతము.

గురుకులంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు ఒకేసారి ఒక దుప్పటి, కార్పెట్, ప్లేట్లు ఇస్తారు. అదీ 30 మందికి మాత్రమే. 30 దాటితే.. ఆపై విద్యార్థులు సొంతంగా కొనుక్కోవాల్సిందే. దుప్పట్లు.. కార్పెట్లు పొందిన సదరు విద్యార్ధి ఐదో తరగతి చదువు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే వరకు మళ్లీ ఎలాంటి పంపిణీ చేయరు. ఐదేళ్ల వరకు.. వీటిని వరకు కాపాడుకోవడం విద్యార్ధి బాద్యత. ఒకవేళ దుప్పట్లు చిరిగిపోయినా.. ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ సమగ్ర హాస్టల్‌ గదుల వెంటిలేటర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మెట్‌పల్లి పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులకు  కప్పుకోవడానికి చెద్దర్లు ఉన్నా, అవి చలిని ఆపేంత స్థాయిలో మందంగా లేవు. దీంతో విద్యార్థులు చెద్దర్లను కప్పుకున్నా వణుకుతున్నారు. ధర్మపురి మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదివే విద్యార్థులదీ ఇదే పరిస్థితి.

వెల్గటూరు మండంలలోని ఎండపెల్లి గ్రామంలో సాంఘీక సంక్షేమ హాస్టల్‌లో కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు చలికి ఇబ్బం దులు పడుతున్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం రగ్గులు పంపిణీ చేయలేదు. దీంతో చలి తీవ్రతకు చాలా మంది విద్యార్థులు రాత్రి పూట వారి వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణానికి చెందిన ఓ హాస్టల్‌వార్డెన్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు త మ పిల్లలను వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అలాంటి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాద్యతా ప్రభుత్వానిదే. వారికి రావల్సిన కాస్మోటిక్‌ ఛార్జీలు, డైట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలి. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే విద్యార్థులు విద్యలో ముందడుగు వేస్తారు. ’అన్నారు.                            
 

మరిన్ని వార్తలు