హోంగార్డు నిజాయితీ

30 Jul, 2016 21:20 IST|Sakshi
హోంగార్డు నిజాయితీ
రాజోలు :
తనకు లభించిన పర్సును నిజాయితీగా సంబంధిత వ్యక్తికి అప్పగించిన హోంగార్డును పలువురు ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే.. రాజోలు సీఐ జీవీ కృష్ణారావు జీపు డ్రైవర్‌ సురేష్‌ హైదరాబాద్‌ ఏసీబీ కార్యాలయ ఏఓ డ్రైవర్‌గా 10 రోజుల పాటు విధి నిర్వహణకు వెళ్లాడు. ఈనెల 12వ తేదీన అక్కడ సురేష్‌ తన రూమ్‌కు వెళ్తుండగా ఓ పర్సు దొరికింది. అందులో రూ. 9 వేలు, మూడు ఏటీఎం కార్డులు, ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు, బస్సు పాస్‌ ఉన్నాయి. ఈ విషయాన్ని వెంటనే సురేష్‌ సీఐ కృష్ణారావుకు తెలిపారు. బస్‌పాస్‌లో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పర్సు పోగొట్టుకున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అశోక్‌కుమార్‌గా గుర్తించి ఆయనకు సురేష్‌ ఫోన్‌ చేశారు. అయినప్పటికీ ఆయన రాకపోవడంతో సురేష్‌ రాజోలు వచ్చేశారు. పలుమార్లు ఫోన్‌ చేయగా అశోక్‌కుమార్‌ హైదరాబాద్‌ నుంచి శనివారం రాజోలు రాగా సీఐ కృష్ణారావు సమక్షంలో పర్సుతోపాటు నగదు, ఏటీఎం కార్డులు అందజేశారు. హోంగార్డు సురేష్‌ నిజాయితీని పలువురు ప్రశంసించారు.

 

మరిన్ని వార్తలు