ఆరిపోయిన ఆశల దీపం

17 Dec, 2016 23:01 IST|Sakshi
– రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం
– మరో ఐదుగురికి గాయాలు
– ఇద్దరి పరిస్థితి విషమం
 
కోవెలకుంట్ల: ఉన్నత చదువులు చదివి పేదకుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కోవెలకుంట్ల– అవుకు ఆర్‌అండ్‌బీ రహదారిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజామల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి వినయ్‌(16) మృతిచెందాడు. గ్రామానికి చెందిన ప్రతాప్, ప్రభావతి దంపతులకు వినయ్, సుస్మిత సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో కూలీపనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు కోవెలకుంట్ల పట్టణంలోని గోటూరు జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సర  సీఈసీ చదువుతున్నాడు. చదువుతోపాటు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. క్రిస్మస్‌ పండుగ సమీపిస్తుండటంతో కొత్త బట్టలు కొనుక్కునేందుకు ఇదే గ్రామానికి చెందిన సునీల్‌ అనే యువకుడితో కలిసి బైక్‌పై కోవెలకుంట్లకు వెళ్లాడు. బట్టలు కొనుగోలు చేసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన సుధాకర్, సుభావతి దంపతులకు అలైఖ్య, సాయికిరణ్‌ సంతానం. గ్రామంలో నాపరాతి గని నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలు ఇద్దరూ అవుకు పట్టణంలో 1వ తరగతి చదువుతున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు ఉండటంతో  తాతగారి ఊరు అయిన కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్లకు కుటుంబ సమేతంగా బైక్‌పై బయలుదేరారు. ఆర్‌అండ్‌బీ రహదారిలో ముదిగేడు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో  ప్రమాదం జరిగింది.
 
        ప్రమాదంలో ఆరుగురు గాయపడగా 108 అంబులెన్స్‌ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ ఆసుపత్రికి వచ్చే సరికి మృత్యువాత పడ్డాడు. మిగతా ఐదుగురు గాయపడటంతో ప్రాథమిక చికిత్స అనంతరం సునీల్, అలైఖ్య, సుధాకర్‌ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది. మరో వారం రోజుల్లో క్రిస్మస్‌ పండుగ ఉండగా కొత్త బట్టల కోసం వెళ్లిన కాలనీ యువకుడు మృత్యువాత పడటంతో ఆల్వకొండ ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సంజామల ఎస్‌ఐ విజయభాస్కర్‌ పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు