వాడుతున్న ఆశలు

18 Jul, 2016 18:05 IST|Sakshi
పూలకుంట సమీపాన వాడుతున్న వేరుశనగ పంట
► రైతుల్లో కలవరం..
► వెంటాడుతున్న వర్షాభావం
► వాన కోసం ప్రత్యేక పూజలు 
 

ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు సరైన వర్షం లేక మొలక దశలోనే ముదిరిపోతున్నాయి. రాయదుర్గం డివిజన్‌ వ్యాప్తం గా 35,200 హెక్టార్లలో వేరుశనగ, 5వేల హెక్టార్లలో సద్ద, ఉలవ, జొన్న, ఆముదం, ఇతర చిరు ధాన్యాల పంటలు సాగైనట్టు వ్యవసాయాధికారుల రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. మొలక వచ్చిన నాటి నుంచి సరైన పదును వర్షం కురవలేదు. దీనికితోడు గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తుండడంతో ఉన్న అరకొర తేమ సైతం ఒట్టిపోయింది.

క్రమేణా ఉష్ణోగ్రతలు కూడా పెరిగి ఎండలు భగ్గుమంటుండటంతో కళకళలాడాల్సిన మొలక ముదిరిపోతోంది. అదిచూసిన అన్నదాతల్లో మళ్లీ కలవరం మొదలైంది. ఏ నలుగురు కలిసినా పసికందు లాంటి మొలకకు వర్షం పడి ఉంటే బాగుండేదని.. ఆ భగవంతుడు ఈ సారైన కష్టాలనుంచి గట్టెక్కిస్తాడో లేదోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురవాలని భజనలు, కప్ప ఊరేగింపు, బొడ్డురాయికి నీళ్లుపోయడం లాంటి పూజలను రైతులు చేస్తున్నారు. వారంలోగా పదును వర్షం కురిస్తే మొలక ఎదుగుదలకు దోహదపడుతుందంటున్నారు.

 

మరిన్ని వార్తలు