ఉద్యాన పంటలకు ఊతం

5 Jun, 2016 02:29 IST|Sakshi
ఉద్యాన పంటలకు ఊతం

ములుగులో 12 ఎకరాల్లో విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తాం
పరిశోధనలకు అనుగుణంగా భవనాలు, ల్యాబులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి

ములుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ఊతంగా నిలిచేలా ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని మంత్రి శనివారం రాష్ట్ర వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు. వాస్తుపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి తెలుసుకున్నారు. ఈ మాట్లాడుతూ ఐసీఏఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్) మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ 12 ఎకరాల్లో భవన నిర్మాణాలు, పరిశోధనల కోసం తరగతి గదులు, ల్యాబ్‌లు, నిర్మిస్తామన్నారు. .

ఈ వర్సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. ఇందులో ఇప్పటికే రూ.85 కోట్లు మంజూరు చేసిందని, ఈ ఏడాదికి మరో రూ.50 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. సాధ్యమైనంత వేగంగా ఇక్కడ ఉద్యాన వర్సిటీని నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో ఉద్యాన తోటలకు ఎంతో ప్రాధ్యాన్యత ఉందని తెలిపారు. 18 లక్షల ఎకరాల్లో పండ్లతోటలు, 14 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పూల తోటలు సాగవుతున్నాయన్నారు. ఈ విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

 కార్యక్రమంలో ఉధ్యాన శాఖ కమిషనర్ వెంకట్‌రాంరెడ్డి, రిజిస్ట్రార్ ప్రతాప్, ప్రొఫెసర్ ప్రవీణ్‌రావు, డిప్యూటీ డెరైక్టర్ రామలక్ష్మి, సిద్దిపేట ఏడీహెచ్ సురేం దర్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు