పురుగుల అన్నం పెడతారా?

27 Aug, 2016 00:02 IST|Sakshi
పురుగుల అన్నం పెడతారా?
ప్రత్తిపాడు (గుంటూరు): పసి పిల్లలకు పురుగుల బియ్యంతో కూడు పెడతారా.. ఇదే మీ ఇంట్లోని పిల్లలకైతే ఇలానే వండి పెడతారా.. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన మీరు బీసీ పిల్లల నోట్లో మట్టి కొడతారా.. అంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అంగిరేకుల ఆదిశేషు ప్రభుత్వంతో పాటు సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తీరుపై ధ్వజమెత్తారు.
 
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్తిపాడులోని బీసీ వసతి గృహాలను శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులతో పాటు స్థానిక సిబ్బందితో మాట్లాడారు. స్థితిగతులు, పరిస్థితులను పరిశీలించారు. తదనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు సొంత నియోజకవర్గంలో వసతి గృహాల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో పరిస్థితి దారుణంగా ఉందని, మరుగుదొడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. హాస్టల్‌ వార్డెన్‌ మస్తాన్‌వలి విద్యార్థులతో అనుచితంగా వ్యవహరిస్తూ వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్యని తెలిపారు.
 
బీసీ బాలికల వసతి గృహంలో నిరంకుశపాలన సాగుతోందన్నారు. 70 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండటం దుర్మార్గమన్నారు. పురుగులు పట్టిన అన్నం పిల్లలకు పెట్టడంతో పాటు మిగిలిన వ్యర్థాలను పిల్లలకు పెడుతూ అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే సంబంధిత వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంత దారుణంగా వసతి గృహాల నిర్వహణ జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఎంతవరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
డీడీకి ఫిర్యాదు.. 
హాస్టల్‌లో దుస్థితిపై బీసీ సంక్షేమ శాఖ డీడీ సూర్యనారాయణకు సంఘ నేతలు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. వసతిగృహాల్లో విద్యార్థులు ఆహారం బాగోలేక అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు టి.శ్రీనివాస యాదవ్, బిట్ర వెంకట శివన్నారాయణ, వై.భాస్కర్, బి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
మరిన్ని వార్తలు