వసతి..కిరికిరి

29 Apr, 2017 00:04 IST|Sakshi
వసతి..కిరికిరి
- అనుమతుల్లేకుండా హాస్టళ్ల నిర్వహణ
- ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల ఇష్టారాజ్యం
- 16 కాలేజీలకు అనుమతులు లేవని నివేదిక
- వీటిలో టీడీపీ నాయకుల అనుచరుల కాలేజీలు
- త్వరలో షోకాజ్‌ నోటీస్‌లు జారీ చేస్తామన్న 
   ఇంటర్‌ బోర్డు అధికారులు 
 
కర్నూలు సిటీ: జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధలు పాటించకుండా ఇంటర్‌ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ప్రైవేట్‌ కళాశాల హాస్టల్‌  విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసుల విచారణ జరపగా..ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థుల బలవన్మరణాలకు ఆయా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లలో సరైన సదుపాయలు లేకపోవడమే కారణమని తేలింది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, భద్రత కోసం సరైన సిబ్బందిని నియమించక పోవడమూ కారణమని ఇంటర్‌ బోర్డు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా హాస్టళ్లు  నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇలా నిర్వహిస్తున్న కాలేజీలు 16 ఉన్నట్లు తేలింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డుకు నివేదిక పంపారు.  
 
ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి...!
జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిలో జిల్లాలో నంద్యాలోని రాపూస్‌ జూనియర్‌ కాలేజీకి మాత్రమే హాస్టల్‌తో కూడిన అనుమతి ఉంది. మిగతా వాటికి ఒక్కదానికి అనుమతి లేదు. హాస్టళ్లతో కలిపి కాలేజీలను నిర్వహిస్తున్నవి సుమారు 30 శాతం ఉంటాయి. అయితే ఇంటర్‌ బోర్డు అధికారులు కేవలం 16 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలతో కూడిన నివేదికను బోర్డుకు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై తనిఖీ చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు ముందే గుర్తించిన కాలేజీలకు నోటీస్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నాయకుల అనుచరులకు చెందిన విద్యా సంస్థలు కూడా అనుమతులు లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అయితే ఆ కాలేజీలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
 
తనిఖీలు చేయని బోర్డు అధికారులు...!
జిల్లాలో ప్రైవేట్‌ కాలేజీలకు అనుమతులు ఇస్తున్న అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రతి కాలేజీని తనిఖీ చేసిన నివేదికను ఇంటర్‌ బోర్డుకు అందజేయాలి. అయితే అధికారులు ప్రైవేట్‌ కాలేజీలను తనిఖీ చేయడంలేదు. కాలేజీల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసి తూతూ మంత్రంగా నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమన్యాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
 
ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి 
                      – వై.పరమేశ్వరరెడ్డి, ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ అధికారి   
జిల్లాలోని ప్రైవేట్‌ కాలేజీల్లో కేవలం నంద్యాలలోని రావూస్‌ జూనియర్‌ కాలేజీకి మాత్రమే హాస్టల్‌ అనుమతి ఉంది. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీల వివరాలను ఇంటర్‌ బోర్డుకు అందజేశాం. వీరిపై చర్యలు తీసుకునే అంశం కమిషనర్‌ పరిధిలో పరిశీలనలో ఉంది.
 
మరిన్ని వార్తలు