ప్రశాంతంగా బంద్‌

30 May, 2017 23:11 IST|Sakshi
ప్రశాంతంగా బంద్‌
తాడితోట,(రాజమహేంద్రవరం) : కేంద్ర ప్రభుత్వం విధించిన వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) పన్ను విధానాన్ని నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల హోటల్‌ యాజమాన్యం పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. కేంద్రం హోటళ్లపై ఐదు శాతం ఉన్న పన్నును 18 శాతానికి పెంచడాన్ని నిరసనగా రాష్ట్ర హోటల్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం బంద్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ, చిన్న తరహా హాటళ్లు మూసి వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోటల్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోసూరి సుబ్బరాజు ఆధ్వర్యంలో అసోసియేషన్‌ నాయకులు కె. దుర్గా ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, పి.సత్యనారాయణ, సూర్య నారాయణ రాజు, రాయుడు వెంకట స్వామి, ఆర్‌కే కుమార్, సుభాన్‌ దోనేపూడి సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్‌టి పన్ను విధానాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. జీఎస్‌టీ పన్ను వల్ల వినియోగదారులపై పెనుభారం పడుతుందన్నారు. గతంలో మాదిరిగా ఐదు శాతం టాక్స్‌ కొనసాగించాలని ఆరు రాష్ట్రాల అసోసియేషన్లు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి వినతి పత్రాలిచ్చారని తెలిపారు. జూన్‌ మూడో తేదీన జరిగిన జీఎస్‌టీ నిర్ధారణ కమిటీ చివరి సమావేశంలో హోటల్‌ రంగం, వినియోగదారుడిపై పడే ఈ అదనపు భారాన్ని కేంద్రం పరిశీలించాలని బంద్‌ పాటించామని అన్నారు. మధ్యతరగతి ఆదాయం అంతంత మాత్రంగా ఉండి కనీసం అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా ఉన్న నేటి ధరల విధానానికి అదనంగా ఈ జీఎస్‌టీ తోడైతే మరింత ఆర్థిక భారం వినియోగదారుడి పై పడుతుందన్నారు. హోటల్‌ రంగంపై ఆధారపడి బతుకుతున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్ల బంద్‌తో జిల్లాలో కొన్ని చోట్ల ప్రజలు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.
మందుల వర్తకుల బంద్‌ ప్రశాంతం
– జిల్లాలో రూ.కోటిపైనే వ్యాపార నష్టం
కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ) : ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసగా డ్రగ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలో చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా జరిగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాల్లో ఉదయం నుంచి మందుల వర్తకసంఘం నాయకులు హడావుడి కనిపించింది. అసోసియేషన్‌ అనుమతి ఇచ్చిన దుకాణాలు మినహా మిగతా మందులషాపులు, ఆయా దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాలో మొత్తం 2500 మందుల దుకాణాలుండగా, వాటిలో సుమారు రెండు వేలకు పైగా మూతపడ్డాయి. దీంతో ఒక్కరోజులో సుమారు రూ.కోటి పైనే నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని దుకాణాలు సాధారణంగా తెరిచారు. అయితే ప్రజలు మందులు కొనుగోలులో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. జిల్లా ఔషధ నియంత్రణశాఖ ఏడీ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ సందర్బంగా డ్రగ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ జిల్లా అ«ధ్యక్షులు కొత్త చలపతిరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మందుల అమ్మకాలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయం అంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోడమేనన్నారు.  

 

మరిన్ని వార్తలు